వక్ఫ్‌బోర్డుల తీరు చూస్తుంటే భారతదేశమంతా తమ ఆస్తే అనేలా ఉన్నారని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
చారిత్రక బుర్హాన్పూర్ కోట యాజమాన్యం తమదేనంటూ మధ్యప్రదేశ్ వక్ఫ్‌బోర్డ్ ప్రకటించుకోడాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టిపడేసింది. కోటలోని షాషూజా సమాధి, నాదిర్షా సమాధి, బీబీసాహిబ్ మసీదు, రాజభవనం అన్నీ తమవేనంటూ వక్ఫ్ బోర్డ్ ప్రకటించుకుంది. హైకోర్టు ఆ ప్రకటన చెల్లదని తేల్చింది.
ఈ వివాదం 2013లో మొదలైంది. అప్పట్లో వక్ఫ్‌బోర్డ్, బుర్హాన్పూర్ కోట, అందులోని పలు ప్రదేశాలు తమవేనంటూ ప్రకటించింది. అక్కడినుంచి ఖాళీ చేయాలంటూ భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఎఎస్ఐ)ను కోరింది. దానిపై ఎఎస్ఐ కోర్టుకెక్కింది. ఎమాగర్డ్ గ్రామం, బుర్హాన్పూర్ పరిసరాల్లోని 4.448 హెక్టార్ల ప్రదేశం ప్రాచీన నిర్మాణాల రక్షణ చట్టం 1904 ప్రకారం రక్షిత ప్రదేశమని, దాన్ని వక్ఫ్‌బోర్డ్ తమసొంత ఆస్తి అని ప్రకటించుకోవడం తప్పంటూ ఎఎస్ఐ, మధ్యప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
బుర్హాన్పూర్ కోట, అందులోని పలు సమాధులు దశాబ్దాలుగా తమ రక్షణలో ఉన్నాయని ఎఎస్ఐ కోర్టుకు తెలియజేసింది. రక్షిత స్థలాలుగా వాటి హోదాను తొలగించనిదే వాటిని వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించడం సాధ్యం కాదని వివరించింది. ఎఎస్ఐ వాదనను వక్ఫ్‌బోర్డ్ తప్పుపట్టింది. ఆ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడం సరైన చర్యే అనీ, ఎఎస్ఐ కోర్టుకు వెళ్ళకుండా వక్ఫ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి ఉండాల్సిందనీ వాదించింది.
కేసును విచారించిన జస్టిస్ జిఎస్ అహ్లువాలియా ధర్మాసనం, ఆ ఆస్తులు ప్రాచీన కట్టడాలుగా 1913నాటికే గుర్తించబడ్డాయనీ, ఆ మేరకు ప్రాచీన కట్టడాల రక్షణ చట్టం 1904 ప్రకారం అధికారిక నోటిఫికేషన్లు ఉన్నాయనీ గుర్తించింది. 1913నుంచి ఇప్పటివరకూ ఆ నిర్మాణాలను చీఫ్ కమిషనర్ కస్టడీలోనుంచి ఒక్కసారైనా తొలగించినట్లు ఎలాంటి ఆధారాలూ లేవని కోర్టు నిర్ధారణకు వచ్చింది.
బుర్హాన్పూర్ కోట తమదేనని ప్రకటించడానికి వక్ఫ్‌బోర్డ్ 1995 నాటి వక్ఫ్ చట్టం సెక్షన్ 5(2) ప్రకారం జారీచేసిన ఒక నోటిఫికేషన్‌ను ఆధారంగా చూపించింది. అయితే ఆ నోటిఫికేషన్ అసమగ్రంగా ఉందని కోర్టు గమనించింది. నిజానికి ఆ నోటిఫికేషన్‌ను మరే ఇతర పక్షాలూ ఖండించలేదు. కానీ ప్రాచీన కట్టడాల రక్షణ చట్టం 1904 సదరు కోటను కేంద్రప్రభుత్వం లేదా పురావస్తు కమిషనర్ పరిధి నుంచి విడుదల చేసినట్లు ఎలాంటి చట్టపరమైన ఆధారాన్నీ వక్ఫ్‌బోర్డ్ చూపలేకపోయిందని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఫలితంగా, ఆ కోట తమదేనన్న వక్ఫ్‌బోర్డ్ ప్రకటన చెల్లదని మధ్యప్రదేశ్ హైకోర్టు నిన్న అంటే 2024 ఆగస్టు 6న తేల్చేసింది. దానికి రిఫరెన్స్‌గా కర్ణాటక వక్ఫ్ బోర్డ్ వెర్సెస్ భారత ప్రభుత్వం 2004 కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రామాణికంగా ఎంపీ హైకోర్టు చూపించింది. ఆ తీర్పు ప్రకారం ప్రాచీన రక్షిత కట్టడాల రిజిస్టర్లో ప్రస్తావించిన ఆస్తులపై యాజమాన్య హక్కులు, వాటి నిర్వహణ బాధ్యతలూ భారతప్రభుత్వానివి మాత్రమే.
మొత్తంగా మధ్యప్రదేశ్ హైకోర్టు వక్ఫ్‌బోర్డ్ నోటిఫికేషన్ సరికాదని తేల్చేసింది. ‘‘ఒక ఆస్తిని ప్రాచీన కట్టడం, రక్షిత కట్టడంగా ప్రకటిస్తే దాన్ని వక్ఫ్ చట్టం 1995 ప్రకారం వక్ఫ్ ఆస్తిగా పరిగణించడం సాధ్యం కాదు. ఒకవేళ అటువంటి ఆస్తిని వక్ఫ్ తన ఆస్తిగా పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసినా, ప్రాచీన కట్టడాల రక్షణ చట్టం 1904 కింద అప్పటికే అమల్లో ఉన్న నోటిఫికేషన్లను అటువంటి వక్ఫ్ నోటిఫికేషన్ రద్దుచేయలేదు’’ అని స్పష్టం చేసింది.
‘‘వక్ఫ్ చట్టం అమలు తేదీ నాటికి వక్ఫ్ ఆస్తి కాని ఆస్తిని తమదిగా చెప్పుకుంటూ తప్పుడు నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ, అలాంటి నోటిఫికేషన్ సదరు ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా చేయజాలదు. ప్రాచీన, రక్షిత నిర్మాణాలను కేంద్రం పరిధి నుంచి తప్పించి వక్ఫ్‌బోర్డ్ పరిధిలోకి తీసుకురాలేదు’’ అని న్యాయస్థానం వివరించింది.
ఆ సందర్భంగా జస్టిస్ జిఎస్ అహ్లువాలియా అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసారు. ‘‘తాజ్‌మహల్‌ను వక్ఫ్ ఆస్తిగా ఎందుకు ప్రకటించలేదు? రేపు మీరు భారతదేశం మొత్తాన్నీ వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తారేమో. మీరు ఒక నోటిఫికేషన్ జారీ చేసి ఏదైనా ఒక ఆస్తిని మీదే అని ప్రకటించేసుకుని లాగేసుకోవడం కుదరదు’’ అని మండిపడ్డారు. బుర్హాన్పూర్ కోటను వక్ఫ్ ఆస్తిగా ప్రకటించేసి, ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ఎఎస్ఐని ఆదేశించడం ద్వారా మధ్యప్రదేశ్ వక్ఫ్‌బోర్డ్ సిఇఒ చట్టపరంగా తీవ్రమైన దోషానికి పాల్పడ్డారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసారు.