పురపాలక, పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరికి మించి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎన్నికల్లో పోటీ చేయడం , సభ్యులుగా కొనసాగించరాదని తీసుకొచ్చిన చట్ట సవరణ రద్దుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం ఆమోదం తెలిపింది.
మంత్రివర్గ సమావేశం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం లో జరిగింది. కేబినెట్ భేటీలో చర్చించిన అంశాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు.
రాష్ట్రంలోని మత్స్యకారుల జీవనప్రమాణాలు మెరుగుపడాలన్న ఉద్దేశంతో గతంలో ఉన్న మాదిరే మత్స్యకార సహకార సొసైటీలకు నామమాత్రపు లీజుకు చెరువులు కేటాయిస్తామని మంత్రి పార్థసారథి వివరించారు. దేశంలో సంతాన సాఫల్య రేటు తగ్గిపోతోందని చాలా అధ్యయనాలు తెలిపాయని, ప్రపంచ గణాంకాలను, జాతీయ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే ఏపీలో సంతాన సామర్థ్య రేటు తక్కువగా ఉందన్నారు.
భూముల రీసర్వేపై రెవెన్యూ శాఖ నోట్ సమర్పించిందని గత ప్రభుత్వం విధానాల కారణంగా ఉత్పన్నమైన వివాదాలపై మంత్రివర్గం చర్చించిందన్నారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించాలని మంత్రులు సూచించారని వెల్లడించారు. బొమ్మల పిచ్చితో గత ముఖ్యమంత్రి రూ.700 కోట్లు దుబారా చేశారన్నారు. రీసర్వేతో భూ యజమానుల్లో ఆందోళనలు పెరిగి, గ్రామాల్లో వివాదాలు జరుగుతున్నాయన్నారు.
ఇక, జగన్ బొమ్మతో ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. . మావోయిస్టులపై ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ కేబినెట్ తీర్మానం చేసిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన మద్యం విధానం కూడా నేటి సమావేశంలో చర్చకు వచ్చిందన్నారు.