రాజ్యసభలో 12 స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. అందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఖాళీలకు సెప్టెంబరు 3న ఎన్నిక జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 3న సాయంత్రం ఓట్ల లెక్కింపు జరగనుంది. సార్వత్రిక ఎన్నికల్లో పలువురు లోక్సభ ఎంపీలుగా ఎన్నికకావడం, మరికొందరు రాజీనామా చేయడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి.
కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా సహా పలువురు రాజ్యసభ సభ్యులుగా ఉంటూనే లోక్ సభకు ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపీ కేశవరావు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి.
మొత్తం 12 రాజ్యసభ స్థానాల్లో 11 స్థానాలను ఎన్డీయే కూటమి అభ్యర్థులు గెలుచుకునే అవకాశముంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్కు ఒక్క స్థానం రావచ్చు. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న కేశవరావు పార్టీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. కేకే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఎన్నికలకు సంబంధించి ఆగస్టు 14న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. నామినేషన్ల సమర్పణకు ఆగస్టు 21 చివరి తేదీ అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 26, 27 చివరి తేదీలు.