బంగ్లాదేశ్‌లో రాడికల్స్ అరాచకాలకు అంతులేకుండా పోతోంది. భారతదేశంపై విషం వెదజిమ్మే ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఆ క్రమంలో ఢాకాలోని ఇండియన్ కల్చరల్ సెంటర్‌లో ఉన్న అవిభక్త భారతదేశపు స్వతంత్ర సమర యోధుడు తీరత్‌సింగ్ సయీమ్ విగ్రహాన్ని ఆగస్టు 6న ధ్వంసం చేసారు. ఆ చర్యను మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా తీవ్రంగా ఖండించారు.
‘‘ఖాసీ పర్వతప్రాంతానికి చెందిన మేఘాలయ స్వాతంత్ర్య సమరయోధుడు తీరత్ సింగ్ సయీమ్. ఢాకాలోని ఇండియన్ కల్చరల్ సెంటర్‌లో ఉన్న ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పరిస్థితులు మరింత దిగజారిపోకుండా కాపాడడానికి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరుతున్నాను’’ అంటూ కాన్రాడ్ సంగ్మా ట్వీట్ చేసారు.
తీరత్‌సింగ్ విగ్రహ నిర్మాణానికి నిధులను భారత ప్రభుత్వం సమకూర్చింది. ఆ విగ్రహాన్ని ఆరు నెలల క్రిందటే అంటే 2024 ఫిబ్రవరి 6న ఆవిష్కరించారు. బ్రిటిష్ వారి పాలనా సమయంలో ఖాసీ తెగకు చెందిన గొప్ప నాయుడు సయీమ్. ఆయనను తెల్లవారు ఢాకాలో నిర్బంధించారు.
బంగ్లాదేశ్ అల్లర్లలో ఇండియన్ కల్చరల్ సెంటర్ తీవ్రంగా ధ్వంసమైంది. సయీమ్ విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేసారు. ఆ ప్రాంతపు చారిత్రక వ్యక్తుల, సాంస్కృతిక మూర్తుల సమాచారాన్ని నాశనం చేసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.