ఆంధ్రప్రదేశ్ లో రాత్రి నుంచి కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై నీళ్ళు నిలవడంతో రాకపోకలు సాగించే వారికి ఆటంకం ఏర్పడింది. ద్రోణి ప్రభావంతో మరో మూడు రోజుల పాటు ఏపీకి వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉత్తర-దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి తమిళనాడు అంతర్భాగం గుండా కొమోరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మూడు రోజుల పాటు వానలు పడే అవకావశముందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
మరో వైపు గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్ , దానిని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ పై గల ఉపరితల అవర్తనం ఏర్పడింది. దీంతో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంగి ఉంది. దీంతో ప్రభావంతో రానున్న 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురవనుంది. ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల పడే అవకాశముందని, మరికొన్ని చోట్ల భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.
దక్షిణ కోస్తా వ్యాప్తంగా మరియు రాయలసీమలో అక్కడక్కడా మూడు రోజుల పాటు తేలికపాటి వానలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.