భారతదేశపు వివాదాస్పద మల్లయోధురాలు వినేష్ ఫోగాట్ పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో ఫైనల్స్‌కు చేరిన ఆనందం ఆవిరైపోయింది. ఉండవలసిన 50కేజీల బరువు కంటె 100 గ్రాములు ఎక్కువ బరువు ఉన్నందుకు ఆమెపై అనర్హత వేటు పడింది.
వినేష్ ఫోగాట్ సాధారణంగా 53కేజీల విభాగంలో ఆడుతుంది. అయితే పారిస్ ఒలింపిక్స్‌కు 53కేజీల కేటగిరీలో మరో క్రీడాకారిణి ఎంపికయింది. దాంతో వినేష్ 50 కేజీల కేటగిరీని ఎన్నుకుంది. నిజానికి 57 కేజీల కేటగిరీలో ఆడమని ఆమెకు వైద్యులు సూచించారు. కానీ తను బరువు తగ్గి 50 కేజీల కేటగిరీలోనే ఆడాలని నిర్ణయించుకుంది.
బుధవారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లలో వినేష్ ఫోగాట్ అద్భుత ప్రతిభ చాటింది. క్యూబా ప్రత్యర్థి గుజ్మన్ లోపెజ్‌ను 5-0 తేడాతో ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. ఇవాళ జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో అమెరికా క్రీడాకారిణి సారా హిల్డర్‌బ్రాంట్‌తో తలపడాల్సి ఉంది. స్వర్ణం లేదా రజతం తప్పకుండా గెలిచే అవకాశం ముంగిట్లో, వినేష్‌పై అనర్హత వేటు పడడం భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బే.