విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద పోటెత్తుతోంది. శ్రీశైలం,నాగార్జునసాగర్,పులిచింతల జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తింది. బ్యారేజీలోని మొత్తం 70 గేట్లు ఎత్తి 73,227 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కాల్వల ద్వారా మరో 13,477 క్యూసెక్కుల వదిలారు. బుధవారం సాయంత్రం లేదా రాత్రికి లక్షన్నర క్యూసెక్కులకు వరద చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేశారు.
బ్యారేజీ గేట్లు ఎత్తిన నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
పులిచింతల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రాజెక్టులో 157.48 అడుగుల్లో 22.75 టీఎంసీలను నిల్వ చేస్తూ దిగువకు 1,08,895 క్యూసెక్కులను వదిలారు. నాగార్జున సాగర్ నుంచి కుడి, ఎడమ కాల్వలకు నీరు వదిలారు.
శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.71 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 883.2 అడుగుల్లో 205.66 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు.