బంగ్లాదేశ్‌లో పెద్దసంఖ్యలో హిందూ దేవాలయాలు, హిందువుల వ్యాపారసంస్థలపై దాడులు జరుగుతున్నాయి. షేక్ హసీనా ప్రధానమంత్రి గద్దె దిగడానికి కారణమైన హింసాకాండ ఆగలేదు. అవామీలీగ్ ప్రభుత్వాన్ని పడదోసిన ఉద్యమ నాయకులు ప్రజలు శాంతియుతంగా ఉండాలని, హిందువులను లక్ష్యం చేసుకుని దాడులు చేయవద్దనీ పిలుపునిచ్చారు. అయినా బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై ఆందోళన నెలకొంది.
17కోట్ల బంగ్లాదేశ్ జనాభాలో సుమారు 8శాతం హిందువులు ఉన్నారు. వారిలో అత్యధికులు చిరకాలంగా షేక్ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్ పార్టీ సమర్థకులు. భారత్‌తో షేక్ హసీనా సత్సంబంధాలు కలిగి ఉండడం, ఆమె పార్టీ మిగతా రాజకీయ పక్షాల కంటె లౌకికవాద దృక్పథంతో వ్యవహరించడం దానికి ప్రధాన కారణాలు. ఒకవైపు ఉన్న ప్రభుత్వం పడిపోవడం, కొత్త ప్రభుత్వం ఇంకా అధికారంలోకి రాకపోవడంతో దేశంలో అరాచకం విచ్చలవిడిగా జరుగుతోంది. అవామీలీగ్ నాయకుల ఇళ్ళు, పోలీస్స్టేషన్లు, జైళ్ళు, హిందువుల సంస్థలపై దాడులు బీభత్సంగా కొనసాగుతున్నాయి.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత, మాజీ ప్రధానమంత్రి బేగం ఖలీదాజియా కొడుకు అయిన తారిక్ రెహమాన్, ప్రజలను శాంతించవలసిందిగా అర్ధించారు. ‘‘ఈ ప్రజాస్వామిక పరివర్తన సమయంలో బంగ్లాదేశ్ ప్రజలు సంయమనం పాటించాలి. మతాలు, రాజకీయాలతో సంబంధం లేకుండా బంగ్లాదేశీలందరినీ రక్షించడం మన విధి. అటువంటి వివక్షతో హింసకు పాల్పడవద్దు. ఏ ఒక్క మతాన్నీ లక్ష్యం చేసుకుని వేధించవద్దు, ప్రతీకారం తీర్చుకోవడం, సమాజంలో విభేదాలకు దారితీయడం వంటివి వద్దు. మన ప్రజాస్వామ్య పథంలో ముస్లిములు, హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, నాస్తికులు… ఇలా ఏ ఒక్కరినీ వదిలేయకూడదు. ఎవరిపైనా వివక్ష చూపకూడదు. మనందరం బంగ్లాదేశీయులమైనందుకు గర్వంగా ఉండాలి’’ అని తారిక్ రెహమాన్ ట్వీట్ చేసారు.
బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి రాణా దాస్‌గుప్తా చెప్పిన వివరాల ప్రకారం సోమవారం నుంచీ జరుగుతున్న హింసాకాండలో సుమారు 300 హిందూ ఇళ్ళను లక్ష్యంగా చేసుకున్నారు. సుమారు 20 హిందూ దేవాలయాలను ధ్వంసం చేసారు. ఆ దాడుల్లో 40మందికి పైగా గాయపడ్డారు.
సిరాజ్గంజ్లోని రాయ్‌గంజ్ ప్రెస్‌క్లబ్ మీద దాడిచేసి, ఖొబొర్పత్ర దినపత్రిక విలేకరి ప్రదీప్‌కుమార్ భౌమిక్‌ను చంపేసారు. ఆ దాడిలో మరో ముగ్గురు జర్నలిస్టులు గాయపడ్డారు. దేశం మొత్తం మీద 25మంది జర్నలిస్టులు గాయపడ్డారు.
కొన్నిచోట్ల దేవాలయాలకు కాపలా కాస్తున్న హిందువులకు కొందరు ముస్లిములు అండగా నిలబడ్డారు. ఢాకేశ్వరి ఆలయాన్ని కాపాడుతున్న హిందువులకు స్థానిక ముస్లిములు తోడుగా నిలిచారు. రామ్నా కాళీ మందిరానికి ఢాకా విశ్వవిద్యాలయ విద్యార్ధులు వంతులవారీగా కాపలా కాస్తున్నారు. వారిలో ముస్లిం విద్యార్ధులు కూడా ఉన్నారు. స్వామిబాగ్లోని ఇస్కాన్ మందిరం దగ్గర ఎవరూ కాపలా లేరు. కానీ అక్కడ ‘మీరు మా సోదరులు, భయం వద్దు’, ‘బంగ్లాదేశ్ మనందరిదీ’ అంటూ రెండు పోస్టర్లు వెలిసాయి. అక్కడ తమకు అందరితోనూ మంచి సంబంధాలు ఉన్నాయనీ, తాము భయపడాల్సిన పని లేదనీ ఇస్కాన్ బాధ్యులు చెప్పారు.
బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతకు భారత్ అమిత ప్రాధాన్యం ఇస్తోందని భారత ప్రభుత్వం వెల్లడించింది. పొరుగు దేశంలో పరిస్థితి గురించి భారత్ తీవ్ర ఆందోళనతో ఉందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ మంగళవారం పార్లమెంటులో చెప్పారు. ‘‘బంగ్లాదేశ్‌లో పరిస్థితిని, అక్కడి మైనారిటీల స్థితిగతులనూ నిశితంగా పరిశీలిస్తున్నాం. వారి రక్షణ, భద్రత కోసం పలు సంస్థలు, గ్రూపులు పనిచేస్తున్నాయి. దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ సహజంగానే అక్కడ శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేవరకూ ఆందోళనగానే ఉంటుంది’’ అన్నారు. దౌత్యపరమైన మార్గాల ద్వారా బంగ్లాదేశ్‌లోని భారతీయులతో న్యూఢిల్లీ నిరంతరం సంపర్కంలో ఉందని వివరించారు.
బంగ్లాదేశ్‌లో ఉన్న భారతదేశీయుల భద్రత కూడా ప్రధానంగా నిలిచింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో సుమారు 19వేల మంది భారతీయులున్నారు, వారిలో 9వేల మంది విద్యార్ధులే ఉన్నారని జయశంకర్ వెల్లడించారు. విద్యార్ధుల్లో అత్యధికులు ఇప్పటికే స్వదేశానికి చేరుకున్నారు. మిగిలినవారు ఇప్పుడు ఇంటిబాటపట్టారు. ఇవాళ ఉదయం ఒక ఎయిర్ఇండియా ఛార్టెర్డ్ విమానం 205 మంది భారతీయులను స్వదేశానికి చేర్చింది.