పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల హాకీ సెమీఫైనల్స్ భారత్ ఓటమి పాలయింది. మంగళవారం నాటి మ్యాచ్‌లో జర్మనీ చేతిలో 2-3 స్కోరుతో పరాజయం చవిచూసింది. మరో సెమీఫైనల్లో నెదర్లాండ్స్ చేతిలో ఓడిన స్పెయిన్‌తో భారత జట్టు కాంస్య పతకం కోసం పోటీ పడుతుంది.
క్వార్టర్ ఫైనల్స్‌లో అద్భుతమైన పోరుతో విజయం సాధించిన భారత్, సెమీఫైనల్ మ్యాచ్‌నూ అదే దూకుడుతో మొదలుపెట్టింది. వరుసగా పెనాల్టీ కార్నర్లు సాధించినా, వాటిని గోల్స్‌గా మలచడంలో మాత్రం విఫలమైంది. మ్యాచ్ మొదలయ్యాక ఏడో నిమిషంలో హర్మన్‌ప్రీత్ మొదటి గోల్ సాధించడంతో భారత్ మొదటి క్వార్టర్లో ఆధిక్యం సాధించింది. రెండో క్వార్టర్ జర్మనీ చెలరేగిపోయింది. ప్రారంభంలోనే ఒక పెనాల్టీ కార్నర్‌ను జర్మన్ ప్లేయర్ గొంజాలో గోల్ చేసాడు. మ్యాచ్ ఫస్టాఫ్ చివరి దశలో క్రిస్టోఫర్ రెండో గోల్ చేసి జర్మనీని ఆధిక్యంలోకి తీసుకెళ్ళాడు.
మ్యాచ్ సెకెండ్ హాఫ్‌లో సుఖ్జీత్ గోల్ చేయడంతో భారత్ జర్మనీలు 2-2తో సమానంగా నిలిచాయి. 53వ నిమిషం వరకూ ఇరు జట్ల స్కోర్లూ సమానంగానే ఉండడంతో షూటౌట్ తప్పదేమో అనిపించింది. అయితే మ్యాచ్ ఆఖరి నిమిషాల్లో భారత్ తడబడింది. దాంతో జర్మనీ ఆటగాడు మార్కో 3వ గోల్ చేయగలిగాడు. చిట్టచివర్లో మ్యాచ్‌ను సమం చేసే అవకాశం వచ్చినా, దాన్ని భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది.
మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్, స్పెయిన్ తలపడ్డాయి. నెదర్లాండ్స్ 4 గోల్స్ చేయగా, స్పెయిన్ ఒక్క గోల్ అయినా చేయలేక ఓడిపోయింది. ఇప్పుడు నెదర్లాండ్స్, జర్మనీ మొదటి రెండు స్థానాల కోసం పోటీ పడతాయి. భారత్, స్పెయిన్ దేశాలు మూడో స్థానం కోసం, కాంస్య పతకం కోసం శ్రమించాలి.