అమెరికాలోని ఇండోమిమ్ సంస్థ అధిపతి, ప్రవాస భారతీయుడు కృష్ణ చివుకుల తాను చదువుకున్న ఐఐటీ మద్రాస్‌కు భూరి విరాళం అందించారు. ఐఐటీ మద్రాస్‌లో పలు కార్యక్రమాల నిర్వహణ కోసం ఆయన మంగళవారం నాడు రూ.228 కోట్ల విరాళం అందజేసారు. దేశంలో ఏ విశ్వవిద్యాలయానికయినా ఒకేసారి ఇంత పెద్దమొత్తంలో విరాళాలు అందడం ఇదే మొదటిసారి.
ఆ సందర్భంగా కృష్ణ చివుకుల మద్రాస్ ఐఐటీలో మీడియాతో మాట్లాడారు. ‘‘నేను ఐఐటీ మద్రాస్‌లో చదువుకున్నాను. ఇక్కణ్ణుంచి అమెరికా వెళ్ళి 55ఏళ్ళు గడిచిపోయాయి. అక్కడ ధనవంతులు విశ్వవిద్యాలయాలకు పెద్దమొత్తంలో విరాళాలు అందిస్తుంటారు. సమాజంలో విద్య, ఆరోగ్యం పెంచడానికి, పేదరిక నిర్మూలనకూ తమవంతు సహాయం చేస్తుంటారు. అదెంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. నా మాతృభూమికి సేవ చేయాలని నాకు కూడా ఎన్నోయేళ్ళుగా కోరిక ఉంది. ఐఐటీ మద్రాస్ నుంచి వచ్చే ఇంజనీర్ల ప్రతిభా సామర్థ్యాలను చూసి అమెరికన్లు ఆశ్చర్యపోతుంటారు. అందుకే, నేను చదువుకున్న ఈ సంస్థ నుంచే నా దాతృత్వ కార్యక్రమాలు మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాను’’ అని కృష్ణ చెప్పారు.
కృష్ణ చివుకుల రాబోయే పాతికేళ్ళపాటు ఐఐటీ మద్రాస్‌లో వివిధ కార్యక్రమాల నిమిత్తం ఆ విరాళాలను వినియోగించే ఏర్పాట్లు చేసారు. కృష్ణ ఏర్పాటుచేసిన నిధి నుంచి పేద విద్యార్ధులకు స్కాలర్షిప్లు అందిస్తారు. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందుతాయి. క్యాంపస్ మ్యాగజైన్లకు నిధులు అందుబాటులో ఉంటాయి. ఇంకా పలు రకాలుగా ఆ నిధులను ఐఐటీ మద్రాస్ సద్వినియోగం చేస్తుందని కృష్ణ వివరించారు.
సమావేశంలో కృష్ణ చివుకులతో పాటు ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి పాల్గొన్నారు. కృష్ణ సేవలకు గుర్తుగా ఐఐటి మద్రాస్‌లోని ఒక బ్లాక్‌కు ఆయన పేరు పెట్టినట్టు అధికారులు వెల్లడించారు.