బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి దిగిపోవలసి వచ్చిన షేక్ హసీనా కొద్దిరోజుల క్రితం ఒ దిగ్భ్రాంతికరమైన ప్రకటన చేసారు. బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలలోని కొన్ని భాగాలను విడదీసి, ఈస్ట్-తైమూర్ లాంటి ఒక క్రైస్తవ దేశాన్ని ఏర్పాటు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. దాన్ని బంగాళాఖాతంలో ఒక స్థావరంగా వాడుకునే ఉద్దేశం ఆ కుట్ర వెనుక ఉందని ఆమె చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వబోనని షేక్ హసీనా అన్నారు. జనవరి 2024 బంగ్లాదేశ్ ఎన్నికలకు ముందు ఒక తెల్లజాతీయుడు తనను కలిసాడని, బంగాళాఖాతంలో ఒక వైమానిక స్థావరం (ఎయిర్‌బేస్) కట్టుకోనిస్తే ఏ సమస్యలూ ఉండవని చెప్పాడనీ ఆమె వివరించారు.
గతేడాది బంగ్లాదేశ్‌లోని ఇస్లామిస్టు రాజకీయ పక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి), దాని జిహాదీ అనుబంధ పక్షం జమాతే ఇస్లామీకి అమెరికా మద్దతు ప్రకటించింది. షేక్ హసీనాకు చెందిన అవామీలీగ్ ప్రభుత్వం గద్దె దిగిపోతుందని, తాము జైల్లో పెట్టిన బిఎన్‌పి, జమాతే సంస్థల నాయకులందరినీ వదిలిపెట్టేస్తుందని, ఆపద్ధర్మ ప్రభుత్వానికి పగ్గాలు అందించి అవామీలీగ్ ప్రభుత్వం దిగిపోతుందనీ, ఆ తర్వాతే బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరుగుతాయనీ అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలూ భావించాయి. కానీ భారత్, చైనా దేశాలు తమ విభేదాలను తాత్కాలికంగా పక్కన పెట్టి, అమెరికా ఒత్తిడిని కాదని షేక్ హసీనాకు మద్దతుగా నిలిచాయి. తద్వారా హసీనా విజయానికి కారణమయ్యాయి.
అప్పటినుంచీ, బంగ్లాదేశ్ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ మీద, కొందరు అధికారుల మీదా కొన్ని ఆంక్షలు విధించడం ద్వారా ఆ దేశపు ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. అవి నిజమే అనిపించేలా కొందరు బంగ్లాదేశీ అధికారుల మీద వీసా ఆంక్షలు అమలయ్యాయి. దాన్నిబట్టి, బంగాళాఖాతంలో వైమానిక స్థావరం కాలన్న డిమాండ్ చేసింది అమెరికాయే అన్న ఊహాగానాలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌లో అమెరికా జోక్యం కేవలం ఎన్నికలను ప్రభావితం చేయడం వరకు మాత్రమే పరిమితం కాలేదు. జియో-క్రిస్టియన్ల కోసం ఒక ప్రత్యేక దేశం ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని షేక్ హసీనా సంకేతాలిచ్చారు.
భారతదేశానికి చెందిన ఒక మీడియా సంస్థతో మాట్లాడిన బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ నాయకులు పలువురు ఆ విషయాన్ని ధ్రువీకరించారు. జో ప్రజల కోసం ‘జోగమ్’ పేరిట ప్రత్యేక క్రైస్తవ దేశం ఏర్పాటుకు కుట్ర జరుగుతోందన్న సంగతిని హసీనా పలుమార్లు చెప్పారని వారు వెల్లడించారు. అంటే భారతదేశంలో కుకీజాతి వారికి ఒక ప్రత్యేకదేశం జాలెన్‌గావ్ ఏర్పాటు చేస్తామని చెప్పినట్లన్న మాట. ఆ ప్రత్యేక దేశంలో మయన్మార్‌కు చెందిన సగాయింగ్ డివిజన్, భారతదేశపు మిజోరం రాష్ట్రం, మణిపూర్‌లోని కుకీల స్థావరాలు, బందర్బన్ జిల్లా, బంగ్లాదేశ్-చిట్టగాంగ్ డివిజన్‌లోని పొరుగు ప్రదేశాలూ ఉంటాయి.
వాటిలో మిజోరం తప్ప మిగతా ప్రాంతాలన్నీ కుకీ-చిన్ ఉగ్రవాద గ్రూపుల చేతిలో ఇప్పటికే చిక్కుకున్నాయి. ప్రత్యేకించి ‘జో’ తెగకు చెందిన వారు – వారినే ‘జోమిలు, కుకి-చిన్ మిజోలు అని కూడా పిలుస్తారు – భారత్, మయన్మార్, బంగ్లాదేశ్ పర్వత ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. చారిత్రకంగా పరిశోధిస్తే వారు మయన్మార్‌లోని చిన్ హిల్స్, పక్కనే ఉన్న భారతదేశానికి చెందిన మణిపూర్, మిజోరం, నాగాలాండ్ ప్రాంతాలకు చెందినవారు. శతాబ్దాల వలసల తర్వాత వారు ఆ ప్రాంతంలో స్థిరపడిపోయారు. అలా పరస్పరం సంబంధం ఉంటూనే, ఈ ప్రాంతంలోని వేర్వేరు ప్రదేశాలకు వ్యాపించారు.
బ్రిటిష్‌వారి వలస పాలనాకాలంలో, జో ప్రజలకు, క్రైస్తవ మిషనరీలకు పరిచయం ఏర్పడింది. 20వ శతాబ్దపు ప్రథమార్థంలో జో ప్రజలను క్రైస్తవులుగా మతమార్పిడి చేసే ప్రక్రియ నిరాఘాటంగా, విస్తృతంగా జరిగింది. దాని ఫలితంగా ఆ ప్రాంతపు సామాజిక-సాంఘిక ముఖచిత్రం మారిపోయింది. భారత, మయన్మార్ దేశాలకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జో ప్రజలు ఇరుదేశాల సరిహద్దుల మధ్య తమను విభజించిన సంగతి గ్రహించారు. భారత్‌లో వారిని షెడ్యూల్డు తెగలు (ఎస్‌టి)లుగా వర్గీకరించడం వల్ల వారికి రక్షణ లభించింది. మయన్మార్‌లో ఎన్నో మిలిటెంటు గ్రూపులు – చిన్ నేషనల్ ఆర్మీ, చిన్‌ల్యాండ్ డిఫెన్స్ ఫోర్స్, చిన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ వంటివి – సాయుధ ఘర్షణల్లో ములిగిపోయాయి, చిట్టగాంగ్ పర్వతశ్రేణుల్లో దోచుకోడాలూ, చంపుకోడాల్లో నిమగ్నమైపోయాయి.
అదేసమయంలో భారతదేశంలో కుకీ నేషనల్ ఆర్మీ, కుకీ నేషనల్ ఫ్రంట్, కుకీ లిబరేషన్ ఆర్మీ వంటి పేర్లతో కుకీ మిలిటెంట్లు మణిపూర్‌లో హత్యలు, కిడ్నాప్‌లు, దోపిడీలకు పాల్పడుతూ… భారతదేశపు ఈశాన్య ప్రాంతంలో తెగల ఘర్షణలకు కారణంగా నిలిచారు, నిలుస్తున్నారు. మిజోరంలో జో రీయూనిఫికేషన్ ఆర్గనైజేషన్ (జెడ్ఆర్ఒ) ప్రధాన లక్ష్యం… మూడు దేశాల్లోనూ వ్యాపించి ఉన్న జో తెగకు చెందినవారు అందరినీ ఏకీకరించాలి అన్నదొక్కటే. మిజోరంలోని జోరం పీపుల్స్ మూవ్‌మెంట్, మిజో నేషనల్ ఫ్రంట్‌లతో పాటు కాంగ్రెస్ పార్టీ మిజోరం రాష్ట్ర శాఖ ఆ డిమాండ్‌ను అంగీకరిస్తున్నాయి.
జో యూనిఫికేషన్ డిమాండ్‌ను ప్రధానంగా ఎగసనదోస్తున్నది చర్చే. మరీ నిర్దుష్టంగా చెప్పాలంటే అమెరికా కేంద్రంగా నడుస్తున్నబాప్టిస్ట్ చర్చే ఈ డిమాండ్ వెనుక ఉంది. ఆ చర్చ్ శాఖలు సిఐఎతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నాయి. 2023 జూన్‌లో వరల్డ్ కుకీ జో ఇంటలెక్చువల్ కౌన్సిల్ అనే సంస్థ, మణిపూర్‌లోని కొండప్రాంతాలనుంచి ప్రత్యేక కుకీ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో జోక్యం చేసుకోవాలంటూ ఐక్యరాజ్యసమితికి, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు ఒక మెమొరాండం సమర్పించింది.
ఆ మెమొరాండంలో వారు ఏం రాసారంటే… ‘‘భారత రాజ్యాంగపు మూడవ అధికరణం ప్రకారం కుకీ దేశం ఏర్పాటు చేయడం ద్వారా స్వయంపరిపాలన సాధ్యమవుతుంది. తద్వారా అధిక సంఖ్యాకుల నియంత్రణ, వివక్ష నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. కుకీ దేశం ఏర్పాటుకు భారత ప్రభుత్వం తటపటాయిస్తుంటే, ఆ విషయంలో కుకీ దేశాన్ని ప్రకటించడానికి మీ జోక్యం అవసరం.’’
మణిపూర్ సంఘర్షణ పూర్తిగా భారతదేశపు అంతర్గత వ్యవహారం. అయినప్పటికీ, భారతదేశపు ప్రాదేశిక సమగ్రతను ప్రశ్నించే అవకాశాన్ని విదేశాలకు ఇవ్వడానికే వరల్డ్ కుకీ జో ఇంటలెక్చువల్ కౌన్సిల్ సంస్థ అలా మెమొరాండం ఇచ్చిందని స్పష్టమవుతోంది. మణిపూర్ విషయం పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారం అని ఒప్పుకుంటూనే భారత్ అడిగితే సహాయం చేస్తామంటూ అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి చెప్పిన సంగతి తెలిసిందే. అలా, ఈ కొత్త దేశం ఏర్పాటు విషయం కేవలం బంగ్లాదేశ్, మయన్మార్‌లకే కాదు భారతదేశానికి కూడా ఆందోళన కలిగించే అంశమే.
దక్షిణాసియాలో కొత్త ప్రత్యేకమైన క్రైస్తవ దేశం ఏర్పాటు అనేది అమెరికా ప్రయోజనాలను కాపాడుతుంది. బుద్ధిస్టుల మయన్మార్ ఎక్కువగా చైనా ప్రభావంలో ఉంటుంది. అమెరికా-చైనా సంబంధాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే.
మరోవైపు, ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా తన ప్రభావం చూపడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆ దేశ ప్రజలకు అసహ్యం కలిగిస్తున్నాయి. అదే సమయంలో అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామి అయిన భారతదేశం తన అంతర్గత వ్యవహారాల్లో విదేశీ ప్రభావాన్ని అనుమతించదు. ప్రత్యేకించి, మోదీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అది జరిగే పని కాదు. అందువల్ల, వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతంలో ఒక పేద, తమమీద ఆధారపి ఉండే, సులువుగా నియంత్రించగల క్రైస్తవ దేశాన్ని ఏర్పాటు చేసుకోవడం అమెరికాకు దక్షిణ, ఆగ్నేయ ఆసియా ప్రాంతంపై పట్టు నిలుపుకోడానికి గొప్ప అవకాశం కాగలదు.
చిన్-కుకీ-జో తెగల వారు నివసిస్తున్న ప్రాంతాల్లో సహజ వనరులు గణనీయంగా ఉన్నాయి. ఖనిజ లవణాలు, చమురు, గ్యాస్‌తో పాటు మాదకద్రవ్యాలు సైతం ఎక్కువే. అమెరికా ప్రయోజనాల కోసం పనిచేసే కొత్త క్రైస్తవ దేశం అక్కడ ఉండే అది వారికి చాలా లాభదాయకం. పైగా అక్కడ అమెరికా తన సైనిక స్థావరాన్ని సైతం ఏర్పాటు చేసుకోవచ్చు. అదే జరిగితే అమెరికా చిరకాల కోరిక తీరినట్లే. షేక్ హసీనా నాయకత్వంలోని బంగ్లాదేశ్, నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత్, చైనా ప్రభావంలో ఉన్న మయన్మార్ సైనిక ప్రభుత్వం అలా ఎప్పటికీ జరగనివ్వవు. పైగా, జలెన్‌గావ్ ప్రాంతంలో సైనిక స్థావరాల ఏర్పాటు చైనా సమీపంలో అమెరికా ఉనికిని మరింత పెంచగలదు, తద్వారా చైనా ప్రభావాన్ని కౌంటర్ బ్యాలెన్స్ చేస్తుంది.
కొత్త క్రైస్తవ దేశం ఏర్పాటుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ఆగ్నేయాసియా ప్రాంతంలో జాతి, మత ఘర్షణలను రెచ్చగొట్టగలవు. దానివల్ల ఘర్షణలు, మానవతా సంక్షోభం, మూడు దేశాల మధ్యా దౌత్య వైఫల్యాలూ సుదీర్ఘకాలం కొనసాగుతాయి. దక్షిణాసియాలో బలమైన మిత్రదేశాన్ని సంపాదించుకోవడంలో అమెరికా అసహనం చెందుతోందని బంగ్లాదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటలిజెన్స్‌కు చెందిన ఒక రిటైర్డ్ సీనియర్ ఆర్మీ అధికారి చెప్పారు. అలాంటి లోటు తీర్చగల కొత్త దేశం, దక్షిణాసియాలో నిర్ణయాత్మక పాత్ర పోషించాలన్న అమెరికా దీర్ఘకాల ప్రణాళికను సాకారం చేయడంలో నిర్దిష్టంగా కనిపిస్తోంది.
అది అలా ఉండగా, భారతీయ ఇంటలిజెన్స్ అధికారి ఒకరు కుకీ-చిన్ వర్గాలు ఒక ఆఖరి యుద్ధం కోసం బలాలు సమీకరించుకుంటున్నాయి. బంగ్లాదేశ్, భారత్, మయన్మార్ భద్రతా బలగాలతో తీవ్రమైన పోరాటం చేయడం ద్వారా బలపడాలని కుకీ-చిన్ గ్రూపులు ప్రయత్నిస్తున్నాయని భారత నిఘా అధికారి ఒకరు వివరించారు. పైగా అవి ఇస్లామిస్టు ఉగ్రవాద సంస్థ ‘జమాతుల్ అన్సర్ ఫిల్ హిందాల్ షర్గీయ’ చేతులు కలిపాయి. గతేడాదే ఆ ఇస్లామిక్ ఉగ్రవాదులు చిట్టగాంగ్ పర్వత ప్రాంతాల్లో కుకీ-చిన్-నేషనల్‌ఫ్రంట్ పర్యవేక్షణలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నాయని తెలిసింది.
భారతదేశంలోని మణిపూర్‌లో కుకీ-చిన్ గ్రూపులు ఒక విషప్రచారాన్ని తయారుచేసాయి. రాష్ట్రంలోని మెయితీలతో కుకీలు, చిన్‌లు కలిసి ఉండడం సాధ్యం కాదన్నదే ఆ ప్రచారం. కుకీ-చిన్‌లు పొరుగుదేశం మయన్మార్‌నుంచి పదులవేల సంఖ్యలో చిన్‌లను భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశపెట్టి, వారిని అక్కడ శాశ్వత నివాసం కలిగించారు. ఫలితంగా, కుకీ చిన్‌ల జనాభా గణనీయంగా పెరిగింది. ఆ తర్వాత కుకీలు ఉద్దేశపూర్వకంగా ఎలాంటి పరిస్థితులు కల్పించారంటే కుకీలు అక్కణ్ణుంచి ఇంఫాల్ లోయలోకి పెద్దసంఖ్యలో వలసవెళ్ళారు. ఇప్పుడక్కడ వారు స్థానిక మెయితీలతో వాటా పంచుకోడానికి యుద్ధాలు చేస్తున్నారు. మొదట వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడుగుతారు, ఆ తర్వాత మిజోరం రాష్ట్రంలో విలీనం చేయమని కోరుతారు.
ఇంకా విచిత్రం ఏంటంటే, ఆ మిలిటెంట్ గ్రూపులు ఒపియం సాగు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా ఆదాయం సంపాదిస్తాయి. ఈ మధ్య సింథటిక్ డ్రగ్స్ కూడా తయారుచేసి మయన్మార్, మణిపూర్ మీదుగా మిజోరం, బంగ్లాదేశ్ వరకూ ఇదే దందా నడుస్తోంది. అలాంటి కార్యకలాపాల నుంచి వచ్చే సొమ్ములతో ఆయుధాలు కొంటారు, మరోవైపు తామే బాధితులమంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం ఇచ్చుకుంటారు. మణిపూర్‌లో హిందూ మెయితీలు, మయన్మార్‌లో బౌద్ధులు, బంగ్లాదేశ్‌లో ఇస్లామిస్టులూ తమను ఊచకోత కోసేస్తున్నారని అబద్ధాలు ప్రచారం చేసుకుంటారు. దానంతటికీ ఒకే ఒక కారణం, జాలెంగావ్ కోసం వారి డిమాండ్‌ను సమర్ధించడమే ఈ మొత్తం వ్యవహారంలో ఏకైక లక్ష్యం.
అందువల్ల, షేక్ హసీనా ప్రకటనను తేలికగా తీసుకోకూడదు. ప్రత్యేకించి భారతదేశం అసలు తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే మణిపూర్‌లో శాంతిస్థాపన ఇంకా సాధ్యపడేలా కనిపించడం లేదు. భారత భద్రతా బలగాలు, నిఘా వ్యవస్థలు అప్రమత్తంగా ఉండాలి. వేర్పాటువాదుల ప్రణాళికలను, విదేశాల కుట్రలను గ్రహించుకుంటూ భారతదేశపు ప్రాదేశిక సమగ్రతకు ముప్పు వాటిల్లకుండా చూసుకోవాలి.