బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది. ఆ పరిస్థితులకు భారతీయ ‘ఉదారవాదులు’, వారికి అండగా నిలిచే జర్నలిస్టులూ తీవ్రంగా స్పందించారు. బంగ్లాదేశ్ పరిస్థితిని ఆసరాగా తీసుకుని భారతదేశపు ప్రజాస్వామిక విధానాలకు మసిపూసి మారేడుకాయ చేసి, మనదేశంలోనూ అనిశ్చితి నెలకొల్పాలని వారు ప్రయత్నించారు.
షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చేసారు. భారత ప్రభుత్వం ఆమెకు న్యూఢిల్లీ దగ్గర హిండన్ ఎయిర్‌బేస్‌లో ఆశ్రయం ఇచ్చింది. బంగ్లాదేశ్‌లో ఆందోళనకారులు ఆమె అధికార నివాసంపై దాడి చేసి తమ ఆగ్రహాన్ని ప్రకటించారు.
బంగ్లాదేశ్‌కు పొరుగుదేశంగా భారత్ ఆ దేశపు సరిహద్దు వెంబడి హై అలర్ట్ ప్రకటించింది. సరిహద్దుల నుంచి దేశంలోకి ఎవరూ చొరబడకుండా బిఎస్ఎఫ్ అప్రమత్తంగా ఉంది. అతి నిఘా వల్ల సరిహద్దుల నుంచి మన దేశంలోకి వచ్చే ప్రతీ ఒక్కరినీ, ప్రతీ రవాణా వాహనాన్నీ తనిఖీ చేస్తున్నారు. ఇక ఆ మార్గంలో ఉండే రైలు సేవలు అన్నింటినీ నిలిపివేసారు.
బంగ్లాదేశ్‌లోని అనిశ్చిత పరస్థితి భారతదేశంలో ఆందోళనలకు కారణమైంది. ప్రత్యేకించి ఒక మానసిక భావానికి చెందిన వారు గగ్గోలు మొదలుపెట్టారు. భారతీయ వ్యాఖ్యాతలు ఎంతటి ప్రేలాపనలు పేలారంటే, బంగ్లాదేశ్‌లో అనిశ్చిత పరిస్థితిని, ఇటీవలి భారత ఎన్నికల ప్రక్రియలను విమర్శించడానికి ఒక అవకాశంగా వాడుకున్నారు.
భారతదేశంలోని ప్రముఖ ‘ఉదారవాద’ జర్నలిస్టులు దేశానికి వ్యతిరేకంగా విషం చిమ్మారు. రాజ్‌దీప్ సర్దేశాయ్, సబా నక్వీ తదితరులు మనదేశంలోనూ అల్లర్లు చెలరేగేంత స్థాయిలో బంగ్లాదేశ్ గురించి వార్తలను వండి వడ్డించారు.
సబా నక్వీ, బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాకాండ వంటి హింస భారత్‌లోనూ ప్రజ్వరిల్లాలనే తన కోరికను నెరవేర్చుకోడానికి ‘ఎక్స్’ సామాజిక మాధ్యమం ద్వారా ప్రయత్నించారు. యాంటీ బీజేపీ, యాంటీ మోదీ వ్యాఖ్యాత రాజ్‌దీప్ సర్దేశాయ్ కూడా బంగ్లాదేశ్ గురించి వ్యాఖ్యానించే క్రమంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన భారత ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యం చేసుకుని అటువంటి వ్యాఖ్యలే చేసారు.
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బంగ్లాదేశ్ పరిస్థితులను అన్వయించి చెబుతూ ఎక్స్‌లో చేసిన ట్వీట్ ద్వారా మరో జర్నలిస్టు అలీషాన్ జాఫ్రీ తన అవలక్షణాన్ని బైటపెట్టుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న హింసాకాండకు కారకులపై షేక్ హసీనా తీసుకున్న చర్యల వంటి చర్యలు తీసుకునే దమ్మూ ధైర్యం మోదీకి లేవని ఆయన వ్యాఖ్యానించాడు.
2024 జనవరిలో షేక్ హసీనా ఐదోసారి బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, ప్రస్తుతం జైల్లో ఉన్న బేగం ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఆ ఎన్నికలను బహిష్కరించింది. ఆ ఎన్నికల్లో రిగ్గింగ్ విపరీతంగా జరిగిందన్న ఆరోపణలు వినవచ్చాయి. అయితే అమెరికా, కెనడా, రష్యా, ఇస్లామిక్ సహకార సమాఖ్య, అరబ్ పార్లమెంట్ వంటి అంతర్జాతీయ పరిశీలక బృందాలు బంగ్లాదేశ్ ఎన్నికలను పర్యవేక్షించాయి. ఆ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగాయని కితాబునిచ్చాయి. అధికార మార్పిడి సాఫీగా జరిగిందని ప్రశంసించాయి.
బంగ్లాదేశ్ ప్రస్తుతం ప్రజా అసంతృప్తి, వ్యతిరేకత, హింసాకాండలో నడుస్తున్నట్లే… భారతదేశంలోనూ అటువంటి పరిస్థితే తలెత్తేలా… సమాంతరంగా మరో కుట్ర జరుగుతోందన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి. భారత్‌లో అటువంటి రాజకీయ దురవస్థ నెలకొనాలని కొన్ని ‘ఉదారవాద’ వర్గాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో రేగుతున్న అరాచక పరిస్థితులు భారత్‌లోనూ తలెత్తేలా చేయడమే ఆ కుట్రదారుల లక్ష్యమని తెలుస్తోంది.