బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల వ్యవహారం తీవ్ర హింసకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని పదవి కోల్పోయిన హసీనా భారత్ చేరుకున్నారు. కొద్ది రోజులు భారత్‌లోనే ఆమె ఆశ్రయం పొందనున్నారు. హసీనా లండన్ వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బ్రిటన్ ప్రభుత్వం నుంచి ఆమెకు ఎలాంటి అనుమతులు రాలేదు. బ్రిటన్ అనుమతిస్తే హసీనా లండన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్పటి వరకు భారత్‌లో సురక్షిత ప్రాంతంలో ఆమె తలదాచుకోనున్నారు. కేంద్రం కూడా హసీనా కొన్ని రోజులు భారత్‌లో ఉండటానికి అనుమతించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
తాజా మాజీ ప్రధాని హసీనా సోదరి రెహనా కుమార్తె తులీఫ్ సిద్దిఖీ బ్రిటన్ పార్లమెంటులో సభ్యురాలిగా ఉన్నారు. అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ సభ్యురాలిగా హసీనా చెల్లెలి కుమార్తె ఉండటంతో అనుమతులు లభిస్తాయని ఆశిస్తున్నారు. అయితే బంగ్లాదేశ్‌లో గత రెండు వారాలుగా జరిగిన హింసపై ఐక్యరాజ్యసమితి విచారణ చేయాలని బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి వ్యాఖ్యానించారు. హసీనాకు బ్రిటన్ అనుమతించే విషయం మాత్రం వెల్లడించలేదు.
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ సరిహద్దుల వెంట కర్ఫ్యూ విధించారు. బంగ్లాకు రైల్, విమాన సేవలను నిలిపివేశారు. బంగ్లాదేశ్‌లోని భారత విద్యార్థులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విదేశాంగ శాఖ హెచ్చరించింది.