కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి నుంచి వరద కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 3 లక్షల 9 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. తుంగభద్ర నుంచి 56 వేల క్యూసెక్కుల వరద శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో వరదను నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. శ్రీశైలం 10 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల వరద కిందకు వదిలారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 62 వేల క్యూసెక్కులు నాగార్జునసాగర్ చేరుతోంది. శ్రీశైలం జలాశయంలో 213 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలుగా ఉంది.
నాగార్జునసాగర్‌కు భారీగా వరద చేరుతోంది. ఇప్పటికే సాగర్‌లో 298 టీఎంసీల వరద చేరింది. పూర్తి కెపాసిటీ 312 టీఎంసీలు. ఎగువ నుంచి 3 లక్షల 56 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. 20 గేట్లు ఎత్తడం ద్వారా పులిచింతలకు లక్షా 69 వేల క్యూసెక్కుల వరద విడుదల చేశారు.
పులిచింతల ప్రాజెక్టులో 5 టీఎంసీల వరద చేరింది. ప్రాజెక్టు సామర్ధ్యం 45 టీఎంసీలు. ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో నాలుగు గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజీకి నీటిని విడుదల చేశారు. గురువారం నాటికి పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండుతుందని అధికారులు చెబుతున్నారు.