అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపేందుకు ఇద్దరు వ్యోమగాములను ఎంపిక చేసిన ఇస్రో, తాజాగా వారిని ప్రత్యేక శిక్షణ కోసం అమెరికాకు పంపింది. హూస్టన్‌లోని ఆక్సియమ్ స్పేస్‌లో వారు శిక్షణ తీసుకుంటున్నారు.
గ్రూప్ కెప్టన్ శుభాన్షు శుక్లాతో పాటు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత బాలకృష్ణన్ నాయర్ లు గగన్‌యాన్ మిషన్‌లో ఉన్నారు. ఆక్సియమ్ స్పేస్, నాసా కెన్నడీ స్పేస్ సెంటర్, స్పేస్ ఎక్స్‌లో వీరు శిక్షణ పొందాల్సి ఉంది.
గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, ప్రైమరీ ఆస్ట్రోనాట్ కాగా, స్పేస్ స్టేషన్ మిషన్ కు గ్రూప్ కెప్టెన్ నాయర్ బ్యాకప్ ఆస్ట్రోనాట్‌గా వ్యవహరిస్తారు. ఆక్సియమ్-4 పేరుతో మిషన్ చేపడుతున్నారు.
2025లో స్పేస్ స్టేషన్లోకి అడుగుపెట్టిన తర్వాత వ్యోమగాములు సుమారు 14 రోజులు అక్కడ గడపనున్నారు. అమెరికా ఆస్ట్రోనాట్ కమాండర్ పెగ్గీ విట్సన్, మిషన్ స్పెషలిస్టు స్లావోజ్ ఉనస్కీ, మరో స్పెషలిస్టు టిబర్ కాపు కూడా శిక్షణ పొందుతున్నారు.