బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఇవాళ మధ్యాహ్నం ఒక మిలటరీ హెలికాప్టర్లో భారతదేశం చేరుకున్నారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో హసీనా తన పదవికి రాజీనామా చేసి, ఆ వెంటనే భారత్కు బయల్దేరారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ప్రధానమంత్రి అధికార నివాసం నుంచి ఆమె బయల్దేరిన కొద్దిసేపటికే వేలమంది ఆందోళనకారులు ఆ నివాసాన్ని చుట్టుముట్టారు.
ప్రధాని అధికారనివాసం గణభవన్ నుంచి హసీనా ఈ మధ్యాహ్నం 2.30 సమయంలో మిలటరీ హెలికాప్టర్లో బయల్దేరారు. ఆమెతో పాటు ఆమె చెల్లెలు షేక్ రెహానా కూడా ఉన్నారు. వారు భారతదేశంలోని త్రిపుర రాజధాని అగర్తలా చేరుకునేసరికి అక్కడ ఢాకాలో ఆందోళనకారులు గణభవన్ను చుట్టుముట్టారు.
దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న కర్ఫ్యూను ధిక్కరించి వందల మంది విద్యార్ధులు రహదారుల మీదకు వచ్చారు. ఢాకా వరకూ లాంగ్ మార్చ్ మొదలుపెట్టారు. మరోవైపు బంగ్లాదేశ్ ఆర్మీచీఫ్ జనరల్ వాకర్ ఉస్ జమాన్ వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు ప్రారంభించారు.
బంగ్లాదేశ్లో కొద్దిరోజులుగా ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు తొలగించాలన్న డిమాండ్లతో విద్యార్ధిలోకం అట్టుడుకుతోంది. ఆగస్టు 4న ఆ ఆందోళనలు ఘర్షణల స్థాయికి చేరుకున్నాయి. ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం నుంచీ దేశమంతటా ఘర్షణలు రేగుతున్నాయి.
విద్యార్ధులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. హింసాత్మకంగా ఆందోళన చేస్తున్న ఉద్యమకారులపై టియర్ గ్యాస్ షెల్స్, స్టన్ గ్రెనేడ్స్ ప్రయోగించారు. దేశవ్యాప్తంగా ఘర్షణల్లో 14మంది పోలీసులు మరణించారు. వారిలో 13మంది సిరాజ్గంజ్లోని ఎనాయత్పూర్ పోలీస్ స్టేషన్లోని వారే. 300మంది పోలీసులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ దేశంలో మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేసారు. నిరవధిక కర్ఫ్యూ నడుస్తోంది. ప్రజాభద్రతను దృష్టిలో పెట్టుకుని బంగ్లాదేశ్ ప్రభుత్వం నేటి నుంచి మూడు రోజులు సెలవులు ప్రకటించింది.