అమెరికాలో ఆర్ధిక మాంద్యం భయాలు స్టాక్ మార్కెట్లను కోలుకోలేని దెబ్బకొట్టాయి. భారీ నష్టాలతో మొదలైన దేశీయ స్టాక్ సూచీలు, ముగింపు సమయానికి కూడా పెద్దగా కోలుకోలేదు. ఉదయం ప్రారంభంలోనే 2600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ముగిసే సమయానికి 360 పాయింట్లు రికవరీ అయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్
2222 పాయింట్లు నష్టపోయి 78759 వద్ద ముగిసింది. నిఫ్టీ 662 నష్టంతో 24055 పాయింట్ల వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో నెస్లే, హెచ్‌యూఎల్ మాత్రమే లాభాలార్జించాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్,ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, ఐసిఐసిఐ, మారుతీ, ఇన్ఫోసిస్ కంపెనీలు నష్టాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. బ్యారెల్ ముడిచమురు 75.35 అమెరికా డాలర్లకు చేరింది.బంగారం ధర 2465 యూఎస్ డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
అమెరికాలో ఉద్యోగ కల్పన రిపోర్టు ప్రతికూలంగా రావడంతో మాంద్యం భయాలు కమ్ముకున్నాయి. జులైలో కనీసం 2 లక్షల ఉద్యోగాల కల్పనకుగాను కేవలం లక్షా 14 వేలు మాత్రమే ఇవ్వగలిగారు. ఇక పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయనే వార్తలు పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేశాయి. ఇప్పటికే అధిక ధరల వద్ద ఉన్న స్టాక్స్ కొనుగోలు చేసేందుకు పెట్టుబడిదారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం కూడా కారణంగా చెబుతున్నారు.