అంతర్జాతీయంగా అందిన ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు భారీ పతనాన్ని చవిచూశాయి. ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్ 2400 పాయింట్లు నష్టపోయి, 73598 వద్ద ట్రేడవుతోంది. నిప్టీ కూడా 724 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం 23993 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, హెచ్‌యూఎల్ మాత్రమే లాభాలార్జించాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ, ఎస్బీఐ, ఇన్ఫోసిస్ తీవ్ర నష్టాలను చవిచూశాయి.
ఎందుకీ పతనం
అమెరికాలో ఆర్ధిక మాంద్యం భయాలు కమ్ముకున్నాయి. జులై మాసంలో ఉద్యోగాల కల్పన రిపోర్టు ప్రతికూలంగా రావడంతో ఒక్కసారిగా పెట్టుబడిదారులు అమ్మకాలకు తెగబడ్డారు. అమెరికాలో జులై మాసంలో 2 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నా కేవలం లక్షా 14 వేలు మాత్రమే ఉద్యోగాలు కల్పించగలిగారు. దీంతో ఒక్కసారిగా పెట్టుబడిదారులు భయాందోళనకు గురయ్యారు.
జపాన్ వడ్డీరేట్లు పెంచడం కూడా ప్రతికూల సంకేతాలిచ్చింది. జపాన్ వడ్డీరేట్ల పెంపుతో టెక్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మార్కెట్ల పతనానికి దారితీశాయి. ఏ క్షణంలోనైనా ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడిచేసే ప్రమాదముందనే సంకేతాలు మార్కెట్లను దెబ్బకొట్టాయి.