అదనపు పనిభారంతో సతమతం అవుతున్నామని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు యాప్ ల నిర్వహణను తమకు అప్పగించి బోధనేతర భారం మోపుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకే సమాచారాన్ని రెండు, మూడు సార్లు నమోదు చేయించడంతో తీవ్రమైన పని ఒత్తిడి ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు.
ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ కమిషనరేట్ మధ్య సమన్వయం లేదని, అందువల్ల ఎవరికి వారే సమాచారాన్ని సేకరిస్తున్నారని చెబుతున్నారు. అధ్యాపకులను బోధనకు దూరం చేస్తూ బోధనేతర పనులకు పరిమితం చేస్తున్నారని చెబుతున్నారు.
గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు 6 రకాల యాప్‌లను అప్పగించారు. వీటిల్లో కొన్నింటిని తొలగించాలని, ఒక్కసారి సమాచారం ఇస్తే అన్ని యాప్‌లకు సమాచారం వెళ్ళేలా అప్ డేట్ చేయాలని ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు. తమ సమస్యలపసై కూటమి ప్రభుత్వం దృష్టిసారించి పరిష్కరించాలని కోరుతున్నారు. యాప్‌ల రూపకల్పన పేరిట రూ.కోట్లు దుర్వినియోగమైనట్లు ఆరోపణలున్నాయనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
జ్ఞానభూమి పోర్టల్ యాప్ పేరిట ప్రతీ రోజూ ఉదయం విద్యార్థుల ముఖ ఆధారిత హాజరు నమోదు చేయడం తప్పనిసరి. ఇందుకు 10-15 నిమిషాల సమయం పడుతోంది.
ఓటీఎల్పీ- ఆన్లైన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ యాప్ ఇది. దీనిని ప్రతీ అధ్యాపకుడు, ప్రతీ తరగతికి వినియోగించడంతో పాటు విద్యార్థులు ఫొటో తీసి అప్లోడ్ చేయడం తప్పనిసరి. దీంతో పాటు ఆ రోజు చెప్పే పాఠం, బోధనకు వినియోగించే టూల్, ఏ పద్ధతిలో పాఠం చెప్పారో వివరాలు నమోదు చేయాలి. 50 నిమిషాల పీరియడ్‌లో ఈ పని చేసేందుకే 5 నుంచి10 నిమిషాల సమయం ఖర్చు అవుతుంది.
ఐ మ్యాప్ యాప్ ద్వారా విద్యార్థికి సంబంధించిన అప్రెంటిస్‌షిప్ వివరాలు నమోదు చేయాలి. అప్రెంటిస్‌షిప్‌కు వెళ్లిన విద్యార్థికి ఉపాధ్యాయుడు ఆ రోజు అప్పగించిన పనిని అందులో అప్ డేట్ చేయాలి. ఇదే సమాచారాన్ని ఉన్నత విద్యామండలి సైతం సేకరిస్తోంది.
అధ్యాపకుల సమస్యల కోసం తీసుకొచ్చిన గ్రీవెన్స్ యాప్ కూడా అదనపు పనిభారంగా మారింది. ఇందులో సమస్యలు నమోదు చేసినా పరిష్కరించిన దాఖలాలే లేవంటున్నారు. ఇది విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు సంబంధించి యాప్ కూడా అధ్యాపకులే నిర్వహించాల్సి వస్తోంది. సెమిస్టర్ పరీక్షల మధ్యలో నిర్వహించే మిడ్ టర్మ్ మార్కుల నమోదుకు మరో యాప్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
విద్యార్థుల కోసం లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టం ను ఉన్నత విద్యా మండలి తీసుకొచ్చింది. ఇందులో వీడియో పాఠాలను అప్లోడ్ చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచుతారు. ఇదే పనిని కళాశాల విద్యాశాఖ కమిషనరేట్ కూడా చేస్తోంది. ఇందు కోసం 18 కళాశాలల్లో రూ.30 లక్షలకుపైగా వెచ్చించి, వీడియో పాఠాలను రూపొందించే కేంద్రాలు ఏర్పాటు చేశారు.