విద్యా దానంలో ఇతరులకు మార్గదర్శకంగా నిలిచిన కృష్ణా చివుకుల
అమెరికా, బెంగళూరుల్లో కార్పొరేట్ సంస్థలు నెలకొల్పడంతో పాటు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తెలుగు తేజం కృష్ణా చివుకుల మరోసారి ఉదారతను చాటుకున్నారు. తాను ఇంజినీరింగ్ చదివిన ఐఐటీ మద్రాస్‌కు రూ. 228 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఐఐటీ నిబంధనల ప్రకారం విరాళాలిచ్చే దాతలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. దీంతో ఈ నెల 6న క్యాంపస్‌లో జరిగే ఒప్పంద కార్యక్రమంలో పాల్గొనేందుకు కృష్ణా చివుకుల అమెరికా నుంచి చెన్నైకి రానున్నారు.
కృష్ణా చివుకుల ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో ఓ మధ్య తరగతి విద్యావంతుల కుటుంబంలో జన్మించారు. ఐఐటీ బాంబేలో బీటెక్ చదివిన తర్వాత ఐఐటీ మద్రాస్‌లో 1970 ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తిచేశారు. ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేశారు. తుముకూర్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేశారు.
యూఎస్ కు చెందిన హాఫ్మన్ ఇండస్ట్రీస్‌కి తొలి భారతీయ గ్రూప్ ప్రెసిడెంట్, సీఈవోగా సేవలందించిన కృష్ణా చివుకుల ఆ తర్వాత న్యూయార్క్ కేంద్రంగా ‘శివ టెక్నాలజీస్’ను స్థాపించారు. ఆ తర్వాత ‘ఇండో ఎంఐఎం’ సంస్థను బెంగళూరులో ప్రారంభించారు. ప్రస్తుతం ‘ఇండో యూఎస్ ఎంఐఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్‌లో దీని టర్నోవర్ రూ.వెయ్యి కోట్లకు పైనే ఉంది. 2009లో తిరుపతి జిల్లా రేణిగుంట లో గౌరి వెంచర్స్‌ను స్థాపించారు.
ఐఐటీ మద్రాస్ అభివృద్ధికి కృష్ణ ఎంతో సాయం అందించారు. 60 ఏళ్ళ నాటి హాస్టళ్ళను రూ.5.5 కోట్లు వెచ్చించి, ఆధునికీకరించారు. విద్యార్థులు శాటిలైట్ రూపొందించేందుకు రూ.1.5 కోట్ల సాయాన్ని అందించారు. క్యాంపస్‌లో స్పేస్‌ల్యాబ్ ఏర్పాటుకు సాయం అందించడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులకు ‘స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ అడ్మిషన్ ప్రోగ్రాం’ పేరుతో నగదు సాయం అందిస్తున్నారు. కృష్ణ సేవలకు గుర్తింపుగా 2015లో ఐఐటీ మద్రాస్, 2016లో ఐఐటీ బాంబే ప్రతిష్ఠాత్మక అలుమ్నస్ అవార్డుతో సత్కరించాయి.
బెంగళూరులో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2,200 మంది పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి నిధులు అందజేయడంత పాటు బాప్టిస్ట్ ఆసుపత్రిని మెరుగుపరిచి పేద పిల్లల వైద్యానికి సహకారం అందిస్తున్నారు 380 మంది పేద, అనాథ పిల్లల చదువుకు ప్రత్యేక సాయం అందిస్తున్నారు.