శ్రీలంకతో జరుగుతున్న రెండోవన్డేలోనూ భారత జట్టు పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచింది. తొలి వన్డే లో టై గా ముగియడంతో, రెండో వన్డేలో ఖచ్చితంగా భారత్ గెలుస్తుందని అభిమానులు ఆశించారు. కానీ, టీమిండియాను భారత్ 32 పరుగుల తేడాతో ఓడించింది. శ్రీలంక లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. లంక కెప్టెన్ చరిత్ అసలంక 3 వికెట్లు తీసి భారత్ పతనంలో పాలుపంచుకున్నాడు.
కొలంబోలోని ప్రేమదాసు స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 240 పరుగులు చేసింది. అనంతరం, 241 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 42.2 ఓవర్లలో 208 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
భారత జట్టు ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ( 64), శుభ్ మాన్ గిల్( 35), అక్షర్ పటేల్( 44) పరుగులు చేశారు. కోహ్లీ (14), శివమ్ దూబే (0), శ్రేయాస్ అయ్యర్ (7), కేఎల్ రాహుల్ (0) పేలవప్రదర్శనతో నిరాశపరిచారు.
ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక (0) నిరాశపరచగా, మరో ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండ్( 40), వన్ డౌన్ లో వచ్చిన కుశాల్ మెండిస్( 30) పరుగులతో రాణించారు. కెప్టెన్ చరిత్ అసలంక( 25) పరుగులు చేయగా లోయర్ ఆర్డర్ లో దునిత్ వెల్లలాగే( 39), కమిందు మెండిస్ (40) పరుగులు చేయడం విశేషం.
భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు, కుల్దీప్ యాదవ్ రెండు , మహ్మద్ సిరాజ్ , అక్షర్ పటేల్ చెరొక వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో శ్రీలంక జట్టు 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఈ నెల 7వ ఇదే మైదానంలో జరగనుంది.