ప్రముఖ కూచిపూడి నృత్యకళాకారిణి యామినీ కృష్ణమూర్తి అనారోగ్యంతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. 1940లో మదనపల్లెలో యామినీ జన్మించారు. చిన్న వయసు నుంచే కూచిపూడి, భరతనాట్యంపై మక్కువ పెంచుకున్నారు. ఎందరో ప్రముఖుల వద్ద కూచిపూడి, భరతనాట్యంపై పట్టుసాధించారు. చిన్నవయసులోనే ప్రదర్శనలు ఇచ్చి అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. యామినీ కృష్ణమూర్తిని కేంద్ర ప్రభుత్వం పదశ్రీ, పద్మ విభూషణ్ పురష్కారాలతో సత్కరించింది. కూచిపూడి, భరతనాట్యాలకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావడంతో యామినీ కృష్ణమూర్తి విశేష సేవలు చేశారని పలువురు కొనియాడారు.
కళాక్షేత్ర వ్యవస్థాపకురాలు రుక్మిణీ అరుండేల్ వద్ద మద్రాసులో భరతనాట్యంలో శిక్షణ తీసుకున్న యామినీ తరవాత, కాంచీపురం ఎల్లప్ప పిళ్లై, తంజావూరు కిట్టప్పపిళ్లై వద్ద మెరుగులు దిద్దుకున్నారు. వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి వద్ద కూచిపూడి నాట్యంలో మెలకువలు సాధించారు. చింతా కృష్ణమూర్తి, పసుమర్తి వేణుగోపాల కృష్ణ శర్మ యామినీ కృష్ణమూర్తిని కూచిపూడిలో తీర్చిదిద్దారు.
ఒడిస్సీల్లోనూ ఆమె శిక్షణ తీసుకున్నారు. గురుపంకజ్ చరణ్ దాస్, కేలూచరణ్ మహాపాత్ర వద్ద శిష్యరికం చేశారు. ఉషాపరిణయం, భామాకలాపం, క్షీరసాగరమధనం, శశిరేఖాపరిణయం నృత్యరూపకాల్లో పలు పాత్రలు పోషించి అంతర్జాతీయ ఖ్యాతి నార్జించారు. ఆమె మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.