తమిళనాడు మంత్రి, డిఎంకె నాయకుడు ఎస్ఎస్ శివశంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. శ్రీరాముడి ఉనికికి చారిత్రక ఆధారాలు లేవంటూ నోరు పారేసుకున్నారు. చోళవంశం గురించి మాట్లాడుతూ ఆ రాజవంశపు నిర్మాణాలు ఆ వంశీయుల ఉనికికి సాక్ష్యాలుగా ఉన్నాయన్నారు.
అరియలూరు జిల్లా గంగైకొండచోళపురంలో శుక్రవారం నాడు రాజేంద్ర చోళుడి జయంతి కార్యక్రమంలో మంత్రి శివశంకర్ పాల్గొన్నారు. ఆ సందర్భంలో మాట్లాడుతూ అసందర్భమైన వ్యక్తులకు సంబంధించి వేడుకలు చేసుకోవడం మానేసి రాజేంద్రచోళుడి వంటి వ్యక్తుల గొప్పదనాన్ని గుర్తించాలి అంటూ వ్యాఖ్యలు చేసారు.
‘‘మనం రాజేంద్రచోళుడిని గౌరవిస్తాం. ఆయన చోళవంశపు చక్రవర్తి. ఆయన చెక్కించిన శిలాశాసనాలు, కట్టించిన గుళ్ళు, తవ్వించిన చెరువులు వంటి పురావస్తు సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఉనికి గురించి మనకు తెలుసు. అయితే శ్రీరాముడి చరిత్ర గురించి ఎలాంటి ఆధారాలూ లేవు’’ అంటూ మాట్లాడారు.
భగవాన్ శ్రీరాముడి గురించి అక్కడ మాట్లాడవలసిన అవసరం ఏమీ లేకపోయినా శివశంకర్ తన ప్రేలాపనలు కొనసాగించారు. ‘‘ఆస్తికులు రాముడు 3వేల యేళ్ళ క్రితం జీవించాడంటారు. ఆయనను అవతారం అంటారు. అవతారం అయితే జన్మ ఉండదు. రాముడే అవతారమూర్తి అయిఉంటే అతను పుట్టి ఉండకూడదు. ఆయన పుట్టాడంటే ఆయన దేవుడు కాడు. ఇటువంటి కల్పనలు మనను మోసం చేస్తాయి, మన చరిత్రను మసకబారుస్తాయి, ఎవరినో గొప్పవారిని చేస్తాయి’’ అని శివశంకర్ మాట్లాడారు.
అంతేకాదు, శివశంకర్ రామాయణ మహాభారతాలను సైతం తీవ్రంగా విమర్శించారు. వాటిలో జీవిత బోధనలు ఏమీ లేవన్నారు. తిరువళ్ళువర్ రచించిన తిరుక్కురళ్ మాత్రమే గొప్పదంటూ రామాయణ భారతాలను తీసిపడేసారు.
శివశంకర్ వ్యాఖ్యలకు బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై, రాముడి గురించి డిఎంకె నేతల అబ్సెషన్‌ను నిలదీసారు.
‘‘భగవాన్ శ్రీరాముడి గురించి డిఎంకె నేతలకు ఉన్నట్టుండి అభిమానం వెల్లువెత్తడం గొప్ప సంగతి. అలా జరుగుతుందని ఎవరు ఊహించారు. గతవారమే ఆ పార్టీకి చెందిన న్యాయశాఖ మంత్రి రఘుపతి, భగవాన్ శ్రీరాముడు సామాజికన్యాయానికి అతిగొప్ప ప్రతినిధి, లౌకికవాదానికి నిలువెత్తు నిదర్శనం, సమానత్వానికి ప్రబోధకుడు అంటూ తీర్మానించారు. ఇప్పుడు కుంభకోణపు మరకలున్న డిఎంకె రవాణా మంత్రి శివశంకర్ చాలా ధైర్యంగా రాముడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రాముడనేవాడు ఎప్పుడూ ఉనికిలో లేడు, అదంతా చోళుల చరిత్రను తుడిచిపెట్టేయడానికి వాడిన కుట్ర అంటున్నారు’’ అంటూ ఎక్స్ సామాజిక మాధ్యమంలో అన్నామలై ట్వీట్ చేసారు.
‘‘డిఎంకె నేతలు ఎంత త్వరగా విషయాలను మరిచిపోతారో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వీళ్ళే కదా మన కొత్త పార్లమెంటు భవనంలో మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ చోళవంశానికి చెందిన సెంగోల్‌ను ప్రతిష్ఠిస్తే వ్యతిరేకించినవారు? తమిళనాడు చరిత్ర 1967లో మాత్రమే మొదలైందని నమ్మేలా కనిపించే ఈ పార్టీకి ఉన్నట్టుండి దేశపు గొప్ప చరిత్ర, సంస్కృతి మీద ప్రేమాభిమానాలు పొంగిపోయాయి. బహుశా డిఎంకె మంత్రులు రఘుపతి, శివశంకర్ కలిసి కూర్చుని, చర్చించుకుని, రాముడి మీద ఏకాభిప్రాయానికి రావాలి. భగవాన్ శ్రీరాముడి గురించి శివశంకర్ తన మంత్రివర్గ సహచరుడి నుంచి చాలావిషయాలు నేర్చుకోగలరు’’ అని అన్నామలై తన ట్వీట్‌లో ఘాటుగా స్పందించారు.
కొద్దిరోజుల క్రితమే డిఎంకె మంత్రి ఎస్ రఘుపతి, రాముణ్ణి ద్రవిడ నమూనాను చాటిచెప్పే యోధుడిగా, సామాజిక న్యాయాన్ని రక్షించే వీరుడిగా వ్యాఖ్యానించారు. డిఎంకె నేతృత్వంలోని ద్రవిడ ప్రభుత్వాన్ని రామరాజ్యంతో పోల్చడాన్ని బీజేపీ తప్పుపట్టింది.
గతేడాది, డిఎంకె యువరాజు, ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.