ప్రపంచ ఆహార భద్రతకు భారత్ కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో ఆహార నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దిల్లీలో అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ సదస్సును ప్రారంభించి ప్రసంగించిన మోదీ, సమగ్ర వ్యవసాయ విధానంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ సంస్కరణల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేశామన్న ప్రధాని మోదీ.. మిల్లెట్లు, పాలు, పప్పులు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రభుత్వ ఆర్థిక విధానానికి వ్యవసాయరంగమే కేంద్రం అన్నారు.
కొత్త వాతావరణాన్ని తట్టుకోగల వెయ్యి 900 రకాల పంటలను గత పదేళ్ళలో ప్రభుత్వం అందించిందని చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద, ఒక్క క్లిక్‌తో పది కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని వివరించారు.
ఈ సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, 75 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.