మధ్యప్రదేశ్‌లో యువజన కాంగ్రెస్ నాయకుడు కుల్‌దీప్ వర్మను పోలీసులు అరెస్ట్ చేసారు. కారణం, అతను తన గాళ్‌ఫ్రెండ్ తస్లీమ్‌ను ఏడుసార్లు పొడిచాడు. తీవ్రగాయాల పాలైన ఆ 19ఏళ్ళ అమ్మాయిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన నీమచ్ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధతిలోని గాంధీ వాటికలో జరిగింది.
కుల్‌దీప్ వర్మ (23) ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. తన గాళ్‌ఫ్రెండ్ తస్లీమ్ తనను మోసం చేస్తూ వేరేవారితో తిరుగుతోందని అతనికి అనుమానం. ‘నీకు ఎందరు బోయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు’ అని నిందిస్తూ ఆమెపై దాడి చేసాడు. నడిరోడ్డు మీద జరిగిన ఆ దాడిని కొందరు వీడియో తీసారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
వీడియోలోని దృశ్యాల్లో ఆ అమ్మాయి రక్తపు మడుగులో పడి ఉంది. కుల్‌దీప్ వర్మా ఆమె మీద అరుస్తున్నాడు. ‘‘ఆమె నన్ను మోసం చేసింది. వీళ్ళకి డబ్బు మాత్రమే కావాలి. నీకు ఎంతమంది బోయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు… అయాన్, ర్యాన్, ఆజాద్, హర్షిత్…. నీకు ఒక్కరు చాలరా?’’ అంటూ ఆమె తనకు ద్రోహం చేసిందని విరుచుకు పడుతున్నట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది.
విషయం తెలిసిన పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరారు. గాయపడిన తస్లీమ్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆ ముస్లిం యువతి బంధువులు తర్వాత ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి మార్చారు. ప్రస్తుతం తస్లీమ్ పరిస్థితి విషమంగా ఉన్నా, నిలకడగా ఉంది.
కేసర్‌పురా ప్రాంతానికి చెందిన కుల్‌దీప్ వర్మ ఈ దాడి చేసిన తర్వాత వెంటనే పారిపోయాడు. తర్వాత పోలీసులకు దొరికిపోయాడు. బోరా బజార్ ప్రాంతానికి చెందిన తస్లీమ్ పరిస్థితి బాగోలేదు, కుల్‌దీప్ వర్మకు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. అతను గతంలో జ్ఞానోదయ మహావిద్యాలయ కళాశాలలో కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం ఎన్ఎస్‌యుఐ అధ్యక్షుడిగా ఉండేవాడు. ఈమధ్యే జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గంలో చోటు సంపాదించాడు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, ఆ జంట పార్కు బైట నిలబడి వాదించుకుంటున్నారు. ఉన్నట్టుండి వర్మ ఒక కత్తిని బైటకు తీసి, తస్లీమ్‌ను పొడవనారంభించాడు. ఆమె అరుపులు విన్నా చుట్టుపక్కల జనాలు ఆమెపై దాడిని ఆపే ప్రయత్నం చేయలేదు. కానీ చాలామంది ఆ దారుణ దృశ్యాన్ని ఫొటోలు, వీడియోలు తీసారు.
పోలీసులు కుల్‌దీప్ వర్మను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ సంఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు, దాడిని చూడడానికి గుమిగూడిన జనాల్లో ఎవరూ ఆ దాడిని ఆపడానికి ప్రయత్నించక పోవడం, బాధిత యువతికి సాయం చేయడానికి ముందుకు రాకపోవడం చర్చనీయాంశం అయింది.