పశ్చిమబెంగాల్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. శుక్రవారంనాడు కురిసిన అతి భారీ వర్షాలకు కోల్‌కతా నగరం జలమయమైంది. సమీప జిల్లాల్లోనూ కుండపోత వర్షాలు నమోదయ్యాయి. ఒక్క రోజే 11 సెం.మీ వర్షపాతం నమోదైంది. కోల్కత్తా నేతాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వరద నీరు చేరింది. పలు విమానాలు రద్దు చేశారు. నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలు నీటమునిగాయి.
పశ్చిమబెంగాల్లోని 12 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, యల్లో అలర్ట్ జారీ చేసింది. బిహార్, ఉత్తరప్రదేశ్ మీదుగా విస్తరించిన అల్పపీడన ద్రోణికి రుతుపవనాలు తోడు కావడంతో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కుండపోత వానలతో అనేక ప్రాంతాల్లో రవాణా స్థంభించిపోయింది.