పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. గత మంగళవారం హమాస్ చీఫ్ హనియా హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ సిద్దమవుతోంది. హమాస్ సైన్యాధిపతి ఇస్మాయిల్ డెయిఫ్‌ను కూడా అంతం చేయడంతో ఇరాన్ రగిలిపోతోంది. ఇరాన్ భూభాగంలోనే కీలక నేతలను హతమార్చడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. తాజాగా హెజ్బోల్లా సీనియర్ కమాండర్ ఫాద్ షుక్ర్ ఇజ్రాయెల్ సైన్యం జరిపినదాడిలో హతమయ్యాడు. దీంతో ఇరాన్, లెబనాన్ దేశాలు ఇజ్రాయెల్‌పై దాడికి సిద్దమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
ఇజ్రాయెల్ వ్యతిరేక దేశాలన్నీ నలుమూలల నుంచి దాడికి దిగాలని ఇరాన్ కీలక నేత అయతుల్లా అలీ ఖమేనీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్లో సంభాషించారు. ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేస్తే తిప్పికొట్టేందుకు అమెరికా యుద్ధనౌకలు, ఫైటర్ జెట్లు పంపినట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై దాడి జరిగే అవకాశముందని తెలుస్తోంది.