తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని జూలైలో 22.13 లక్షల మంది దర్శించుకున్నారని, హుండీ ద్వారా రూ.125.35 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ ఈవో జే.శ్యామలరావు చెప్పారు. జూలైలో 1.04 కోట్ల లడ్డూప్రసాదాలు విక్రయించామని వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న శ్యామలరావు, ఇందులో భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
గతంలో వారానికి 1.05 లక్షలు ఇచ్చే ఎస్ఎస్డీ టోకెన్లు, భక్తులు క్యూల్లో వేచి ఉండే సమయం తగ్గించేందుకు ప్రస్తుతం 1.47 లక్షలు ఇస్తున్నామన్నారు. ఆగస్టు 15 నుంచి 17 వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయని, ఆగస్ట్ 14న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. గత 29 రోజులకు గాను స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలతో పాటు నగదు రూపంలో రూ.3,31,70,665 ఆదాయం వచ్చిందని దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు. 127 గ్రాముల బంగారు ఆభరణాలు, 4.400 కిలోగ్రాముల వెండి ఆభరణాలు కూడా లభించాయన్నారు. వీటితోపాటు పలు దేశాలకు సంబంధించిన కరెన్సీ కూడా స్వామివారికి భక్తులు సమర్పించారని తెలిపారు.