గత ఐదేళ్ళ వైసీపీ పాలనలో తితిదే పరిధిలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ అన్నారు. అక్రమార్కుల పాపం పండిపోవడంతో సాక్షాత్తు తిరుమల వెంకన్న ఈ అక్రమాలను వెలుగులోకి తెస్తున్నారని అభిప్రాయపడ్డారు.
తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు ఎంతో భక్తితో వేసిన కోట్లాది రూపాయల విదేశీ కరెన్సీ నోట్లు ఇతర కానుకలు చోరీకి గురయ్యాయని ఆరోపించారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తితో రాజీపడి, టీటీడీకి విరాళంగా కొంత ఇప్పించి, మిగతా మొత్తాన్నివాటాల వారీగా కొందరు ఉన్నతాధికారులు పంచుకున్నారని ఆరోపించారు.
గతంలో ఈవోగా పనిచేసిన వ్యక్తితో పాటు ఎస్పీ స్థాయి పోలీసు ఉన్నతాధికారి, , సీఐ స్థాయి పోలీస్ అధికారులు కొన్ని ఆస్తులను నేరస్తుడి నుంచి స్వాధీనం చేసుకుని పంచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. శాసనమండలి లో సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారని చెప్పారు. స్వామి వారి సొమ్మును కాజేసిన వ్యక్తితో ఎందుకు రాజీపడ్డారో తెలపాలన్నారు. కేసును తొక్కిపెట్టడం వెనుక ఉన్న సూత్రధారులను బయటపెట్టాలన్నారు.