అంతర్జాతీయంగా అందిన ప్రతికూల సంకేతాలతో స్టాక్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఒకే రోజు రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఓ దశలో 900 పాయింట్లుపైగా నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 885 పాయింట్లు నష్టపోయి, 80981 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా భారీగా పతనమైంది. నిఫ్టీ 293 పాయింట్లు తగ్గి 24717 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు మినహా అన్ని షేర్లు నష్టాలను చవిచూశాయి.రూపాయి బలహీనపడింది. అమెరికా డాలరుతో రూపాయి విలువ 84.60కు చేరింది. ముడిచమురు ధరలు దిగివచ్చాయి. బ్యారెల్ ముడిచమురు ధర 79.62 అమెరికా డాలర్లకు తగ్గింది.
మదుపరులు భారీ నష్టాలను చవిచూశారు. ఒకే రోజు రూ.5 లక్షల కోట్ల సంపద కరిగిపోయింది. ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లు అన్నీ నష్టాలను చవిచూశాయి. అమెరికాలో ఫ్యాక్టరీ డేటా ప్రతికూలంగా విడుదల కావడంతో పెట్టుబడిదారులు స్టాక్స్ అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు పతనం అయ్యాయి.