మగ, ఆడ సింహాలకు అక్బర్, సీతగా నామకరణం చేసి బెంగాల్ ప్రభుత్వం ఒకే ఎన్క్లోజర్లో ఉంచిన ఘటన దేశ వ్యాప్తంగా వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్లోని సిలిగురి సఫారీ పార్కుకు త్రిపురలోని సిఫాహీజలా జూ పార్కు నుంచి ఫిబ్రవరిలో రెండు సింహాలను తీసుకువచ్చారు. వాటికి త్రిపుర జూ అధికారులు అక్బర్, సీతగా నామకరణం చేశారు. ఆ సింహాలను సిలిగురి జూపార్కులో ఉంచి ఒకే ఎన్క్లోజర్లో వేయడంపై విశ్వహిందూ పరిషత్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన న్యాయమూర్తి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సింహాల పేర్లు మార్చాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
తాజాగా సింహాలకు సూరజ్, తాన్యాగా పేర్లు మార్చారు. దీంతో వివాదానికి తెరపడినట్లేనని అదనపు అడ్వకేట్ జ్యోగి చౌధురి చెప్పారు.