భారతీయత ప్రధానకేంద్రంగా విద్యావిధానం ఉండాలి అన్నదే జాతీయ విద్యావిధానం ప్రధాన లక్ష్యం. భారతీయ విజ్ఞాన సంప్రదాయంలో వైదికకాలం నుంచి ఆధునిక వర్తమానకాలం వరకూ రసాయశాస్త్రం ప్రధానమైన శాఖగా ఉంటూవస్తోంది. అథర్వవేదంలో ప్రస్తావించిన పలురకాల రసాయనాల తయారీ విధానాన్ని క్రమపద్ధతిలో డాక్యుమెంట్ చేసి ప్రచురించిన ఘనత సాధించిన భారతీయ విద్వాంసుడు ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే.
ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే దేశీయ శాస్త్రప్రపంచానికి అందించిన గొప్ప రచన ‘ది హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ’. భారతీయమైన రసాయనశాస్త్రాన్ని వివరించే మౌలికమైన రచన అది. ఆచార్య పిసి రే 1861 ఆగస్టు 2న జన్మించారు. ఆయన కేవలం రసాయ శాస్త్రవేత్త మాత్రమే కాదు, మన దేశంలో రసాయన పరిశ్రమలకు పునాది వేసిన ఘనత ఆయన సొంతమే. రసాయనశాస్త్రం ఆధునిక రూపానికి సంతరించుకోవడం ఒక క్రమపద్ధతిలో దశలవారీగా జరిగింది. మొదటి దశలో వేదకాలం నాటి రసాయనశాస్త్రం ఉండేది. ఋగ్వేదంలోనూ, అథర్వణ వేదంలోనూ ప్రస్తావించిన రసాయనాల గురించి పిసి రే తన రచన ‘ఆల్కెమికల్ ఐడియాస్ ఇన్ ది వేదాస్’ అనే పుస్తకం మొదటి అధ్యాయంలో వివరించారు. తరువాతి దశలో ఆయన వైశేషిక దర్శనంలోని అధిభౌతికశాస్త్రాన్నీ, శైవతాంత్రిక కాలం నాటి రసాయనశాస్త్రాన్నీ వివరించారు. ఆ తర్వాత ఆయన చరకుడు, శుశ్రుతుడు తదితరులు వైద్యశాస్త్రంలో ఉపయోగించిన రసాయనశాస్త్రాన్ని వివరించారు. దాని తర్వాత ఆధునిక రసాయన శాస్త్రవేత్తల గురించి వివరించారు.
ఆచార్య రే ఆలోచనలు ఎప్పుడూ రసాయనశాస్త్రపు మౌలిక సూత్రాల నుంచి దూరంగా వెళ్ళలేదు. రసాయనశాస్త్రం ఋగ్వేదకాలంలో మొదలైంది. దానికి తగిన సాక్ష్యాధారాలను రే ప్రకటించారు. ఋగ్వేదంలో అశ్వనీ దేవతల ప్రస్తావన ఉంది. వైద్యశాస్త్రంలోనూ, మెటలర్జికల్ ఆపరేషన్స్‌లోనూ ఉపయోగించిన ప్రక్రియలను పిసి రే వివరించారు. ఋగ్వేద మంత్రాలలోని రసాయనాలను వ్యక్తులుగా సంభావిస్తూ వేదమంత్రాలలో చేసిన ప్రస్తావనలను ఆయన రసాయన శాస్త్రపరంగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత చరక, శుశ్రుతుల కాలంలో సాధారణ ప్రజలకు వైద్యంలో ఉపయోగించిన రసాయనశాస్త్రాన్ని వివరించారు. ఫార్మకాలజీకి చెందిన మౌలిక తత్వంగా భావించే వైశేషిక దర్శనంలోని అధిభౌతిక భావనలను పిసి రే తన రచనలో ప్రస్తావించారు. వైశేషిక దర్శనంలో చెప్పే 6 పదార్ధాలు – 24 లక్షణాల రసాయనిక విశ్లేషణ ద్వారా వాటికీ ఆరు రుచులకూ ఉన్న సంబంధాన్ని రే వివరించు. చరక సుశ్రుతుల వైద్యవిధానాలలోని రసాయనిక ప్రయోగాలను పిసి రే నిశితంగా విశ్లేషించారు.
తత్వశాస్త్రాన్ని వైద్యంలాంటి మౌలిక వైజ్ఞానికశాస్త్రంగా వివరించడమే ఓ గొప్ప విజయం. ఆయుర్వేద కాలాన్ని వివరించేటప్పుడు నిగూఢమైన, సూక్ష్మమైన మూలకాలను లెక్కించే క్రమంలో తన్మాత్ర విభజన, సాంఖ్య దర్శనంలోని మహాభూతాలు, వైశేషిక దర్శనంలోని పరమాణు సిద్ధాంతం, ఏక-ద్వి-త్రి-చతుర్ధి అణువుల నిర్మాణ వివరణ, వైశేషిక దర్శనంలో చెప్పిన- పదార్ధానికి ఉండే 24 లక్షణాల వివరణ, వైద్యశాస్రంలో వాటి వినియోగాన్ని నిరూపించడం వంటివి పిసి రే మానసిక పరిణతికి నిదర్శనాలు.
ఆచార్య చరకుడు, ఆచార్య సుశ్రుతుల కాలం నాటి రసాయన శాస్త్రాన్ని వివరించడంలో శుద్ధమైన రసాయన నామ్నీకరణను ఉపయోగించడం పిసి రే మేధోశక్తికి, శాస్త్ర సంపన్నతకూ ఓ గొప్ప ఉదాహరణ. ప్రాచీన, ఆధునిక నామాలను సమన్వయం చేయడం ఆ రెండు విభాగాల్లోనూ ఆయన ప్రతిభను చాటుతుంది. ఆల్కలీన్ ఎలిమెంట్స్‌ను క్షత్రియ మూలకాలు అన్నాడు. పారదము (పాదరసం) అంటే మెర్క్యురీ, యశదము (రాగి) అంటే కాపర్, కజ్జలి అంటే బ్లాక్ మెర్క్యురిక్ సల్ఫైడ్… ఇంకా అలా చాలా రసాయన పదార్ధాల భారతీయ పేర్లను ఆధునిక పేర్లతో కలిపిన జ్ఞానం ఆయన సొంతం. వృంద, చక్రపాణి వంటి భారతీయ రసాయన శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనల గురించి సోదాహరణంగా ప్రస్తావించడం ఆయన అపార జ్ఞానసంపదకు నిదర్శనం. మైకా, పాదరసాలను శివ పార్వతులతో పోల్చి, వాటి మిశ్రమమే అమృతం అని వివరించడం ద్వారా రసాయనాలకు వ్యక్తి రూపం ఇచ్చే సిద్ధాంతాన్ని ఆచార్య పిసి రే ప్రతిపాదించారు.
ఆచార్య పిసి రే కేవలం రసాయన మూలకాల గురించి, వాటి సూత్రాల గురించి మాత్రమే చెప్పలేదు. ఆయన తన రచనలో డోల యంత్రం, స్వేదనీ యంత్రం, అధస్పాతన యంత్రం, ఢేకి యంత్రం, వాలుక యంత్రం వంటి ప్రాచీన పరికరాల గురించి కూడా వివరించారు. వాటిని బట్టే ఆయన అధ్యయనం ఎంత గాఢమైనదో, ఎంత నిశితమైనదో తెలుస్తుంది. భారత విజ్ఞాన సంప్రదాయ ఆచార్యుల గురించి తెలుసుకోవాలంటే ప్రఫుల్ల చంద్ర రే గురించి అధ్యయనం చేయడం తప్పనిసరి.