కృష్ణా నదిలో వరద కొనసాగుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తోన్న అతి భారీ వర్షాలకు వరద పోటెత్తింది. మరోవైపు తుంగభద్ర నుంచి 2 లక్షల వరద నీటిని సుంకేశుల బ్యారేజీకి వదులుతున్నారు. అక్కడి నుంచి వరద శ్రీశైలం చేరుతోంది. మరోవైపు జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 3 లక్షల 26 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో వరదను పెద్ద ఎత్తున నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి 4 లక్షల 36వేల క్యూసెక్కుల వరదను నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 60 వేల క్యూసెక్కులు సాగర్‌కు చేరుతోంది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, హంద్రీనీవాకు 32 వేల క్యూసెక్కులు తెలంగాణలోని ఎత్తిపోతల పథకాలకు 12 వేల క్యూసెక్కులు విడుదల చేశారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వేగంగా నిండుతోంది. గత వారం వరకూ ఎడారిని తలపించిన ప్రాజెక్టుకు వరద చేరుతోంది. ఇప్పటికే నాగార్జునసాగర్‌కు 548 అడుగుల నీరు చేసింది. ఇది 200 టీఎంసీలకు సమానం. ఇంకా 112 టీఎంసీలు చేరితే సాగర్ నిండుతుంది. మరో మూడు రోజుల్లో నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి వరదను కిందకు విడుదల చేయనున్నారు. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. సాయంత్రం 4 గంటలకు ఎడమ కాలువకు నీటిని విడుదల చేయనున్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు