సెల్ఫోన్ ఛార్జర్ చిన్నారి ప్రాణాలు తోడేసిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ జిల్లా కడెం మండలం, కొత్తమద్దిపడిగ గ్రామానికి చెందిన దుర్గం రాజలింగు, సుశీల దంపతుల రెండో బిడ్డ ఆరాధ్య గురువారం సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి కరెంటు బోర్డుకు వేలాడుతోన్న సెల్ఫోన్ ఛార్జర్ పిన్ నోట్లో పెట్టుకుంది. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో చిన్నారి కుప్పకూలిపోయింది. వెంటనే తల్లిదండ్రులు సమీప ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
సెల్ఫోన్ ఛార్జర్లు చిన్నారులకు అందుబాటులో ఉంచవద్దని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెల్ఫోన్ ఛార్జర్ల నుంచి ఒక్కోసారి పెద్దమొత్తంలో కరెంటు సరఫరా అయ్యే ప్రమాద ముందని, తడి చేతులతోతాకడం, నోట్లో పెట్టుకోవడం చేయవద్దని సూచిస్తున్నారు. ఫోన్ ఛార్జింగ్ చేయని సమయంలో తప్పనిసరిగా స్విచ్ ఆఫ్ చేయాలని నిపుణులు కోరుతున్నారు.