పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. హమాస్ మిలటరీ, పొలిటికల్ కమాండర్లను ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టడంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. హెజ్బొల్లా సీనియర్ మిలటరీ కమాండర్ షాద్ షుక్రీ హతమైన రెండు రోజుల్లోనే లెబనాన్ ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడింది. రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. అయితే ఐదు రాకెట్లు మాత్రమే తమ భూభాగంలోకి ప్రవేశించాయని ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ ప్రకటించింది. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లలేదని తెలిపింది.
ఇజ్రాయెల్‌పై దాడికి సిద్దంగా ఉండాలంటూ ఇరాన్ సీనియర్ నేత పిలుపునిచ్చిన 24 గంటల్లోనే హెజ్బొల్లా తీవ్రవాదులు దాడులకు దిగారు. మరో వైపు ఇరాన్ కూడా ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై దాడులు చేసే అవకాశం లేకపోలేదు. పాలస్తీనాలో హమాస్ చివరి తీవ్రవాదిని ఏరివేసే వరకు యుద్ధం ఆపే ప్రసక్తే లేదని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు పలు మార్లు ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి హెచ్చరించినా కాల్పుల విరమణకు ముందుకు రాలేదు.