మధ్యప్రదేశ్‌లోని భిండ్, మోరేనా జిల్లాల్లో ఆశ్చర్యకరమైన కుంభకోణం బైటపడింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే ఆ రెండు జిల్లాల్లోనూ ముస్లిం జనాభా తక్కువ. కానీ ఆ రెండు జిల్లాల్లో మదరసాల సంఖ్య అసాధారణంగా ఎక్కువగా ఉంది. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఆ మదరసాల్లో ముస్లిం పిల్లల కంటె హిందూ పిల్లల సంఖ్యే ఎక్కువ. దాని గురించి పరిశోధిస్తే, ఆ పిల్లలు మదరసాలకు హాజరయ్యేది చాలా తక్కువ. వారు సాధారణ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ప్రభుత్వ నిధులను దిగమింగడం కోసమే ఇలా ఎక్కువ మదరసాలు పెట్టి నకిలీ విద్యార్ధులను చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
భిండ్ జిల్లాలో 67, మోరేనా జిల్లాలో 70 మొత్తంగా ఆ రెండు జిల్లాల్లోనూ 137 మదరసాలు ఉన్నాయి. వాటిలో 3880 మంది హిందూ విద్యార్ధులు ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. అయితే, వారు చదువు కోసం మదరసాలకు వెళ్ళడం లేదు. సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సాధారణ విద్యనే అభ్యసిస్తున్నారని పరిశోధనలో తేలింది. మరి మదరసాల్లో విద్యార్ధులు ఎక్కువమందిని ఎందుకు చూపిస్తున్నారు? దాని వెనకాల ఒక పెద్ద కుంభకోణం ఉన్నట్లు అర్ధమవుతోంది. ఒక మదరసాలో వంద మంది విద్యార్ధులు ఉంటే రూ.50వేల నిధి వస్తుంది. అంటే ఎన్ని వందల మంది పిల్లలు చదువుతుంటే అన్ని 50వేలన్న మాట.
విచిత్రమైన విషయం ఏంటంటే, తమ పిల్లలు ఫలానా మదరసాలో ఎన్‌రోల్ అయి ఉన్నారన్న సంగతి ఆ పిల్లల తల్లిదండ్రులకు సైతం తెలియదు. అంటే, ప్రభుత్వ నిధులను కాజేయడానికి మదరసాల్లో ఎన్‌రోల్‌మెంట్ సంఖ్యను చట్టవిరుద్ధంగా పెంచి చూపిస్తున్నారన్న మాట. అందుకే మదరసాల నిర్వహణ మీద, వాటికి ప్రభుత్వ వనరుల వినియోగం మీద సందేహాలు తలెత్తుతున్నాయి.
మధ్యప్రదేశ్‌లో ముస్లింల జనాభా ఎక్కువ ఉన్న జిల్లా బుర్హాన్‌పూర్. ఆ జిల్లాలో 23 మదరసాలు మాత్రమే ఉన్నాయి. భిండ్, మోరేనా జిల్లాల్లో ముస్లిం జనాభా సాపేక్షంగా తక్కువ. అయినప్పటికీ బుర్హాన్‌పూర్‌లో కంటె ఆ రెండు జిల్లాల్లో మదరసాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మదరసా విద్య కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను కాజేయడం కోసమే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి.
మదరసాల్లో విద్యార్ధుల చేరిక వల్ల ప్రభుత్వం నుంచి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ప్రతీ వంద మంది విద్యార్ధులకు, 70శాతం అటెండెన్స్ ఉంటే మదరసాలకు అందే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి…
2.10 క్వింటాళ్ళ గోధుమలు
వంట ఖర్చులకు నెలకు రూ.11440
వంటవాళ్ళకు నెలకు రూ.4000
గ్రాడ్యుయేట్ టీచర్లకు నెల జీతం రూ.3000
పోస్ట్‌గ్రాడ్యుయేట్ టీచర్లకు నెల జీతం రూ.6000
మదరసాల్లో చదువుకోడానికి విద్యార్ధులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ ప్రయోజనాలు కల్పిస్తోంది. అయితే తప్పుడు గణాంకాలతో మోసం చేసి ప్రభుత్వ ప్రోత్సాహకాలను దుర్వినియోగం చేస్తున్నారు.
భిండ్ పట్టణంలో బాలికల కోసం ప్రత్యేకంగా కొన్ని మదరసాలున్నాయి. మదరసా హుస్సేనీలో 77మంది విద్యార్ధినులు ఉన్నారు. వారిలో 44మంది హిందూ అమ్మాయిలే. మదరసా దీన్-ఎ-అక్బర్‌లో 83మంది విద్యార్ధినులు ఉంటే వారిలో 44మంది హిందూ అమ్మాయిలే. మదరసా మజీద్ నవీలో 87మంది విద్యార్ధినులు ఉన్నారు, వారిలో 38మంది హిందూ అమ్మాయిలే.
అలా భిండ్, మోరేనా జిల్లాల్లో మొత్తం 137మదరసాలు ఉంటే, వాటిలో 3880మంది హిందూ పిల్లలు ఉన్నారు. దాన్నిబట్టే, విద్యకు ప్రోత్సాహం ఇవ్వడం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను దుర్వినియోగం చేయడం కోసం మదరసాల్లో పెద్ద స్కాం జరుగుతోందని అర్ధమవుతోంది.
మదరసాల్లో విద్యార్ధుల అంకెలను ఎక్కువ చేసి చూపడం కోసం హిందూ పిల్లలను ఎన్‌రోల్ చేసుకున్నట్లు మోసం చేస్తున్న విషయం బైటపడడం మధ్యప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. జులై 30న ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. శివపూర్‌లొని 80 మదరసాల్లో 56 మదరసాల గుర్తింపు రద్దు చేసారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ మదరసాలను భౌతికంగా తనిఖీ చేయాలంటూ రాష్ట్ర పాఠశాలవిద్య మంత్రి రావు ఉదయ్‌ప్రతాప్ ఆదేశించారు.
నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ – బాలల హక్కుల రక్షణ కోసం జాతీయ కమిషన్ – ఛైర్మన్ ప్రియాంక్ కనూంగో నేతృత్వంలో ఈ వ్యవహారంలో దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కమిషన్ తొలుత భిండ్, మోరేనా జిల్లాల్లోని మదరసాలను తనిఖీ చేసింది. అక్కడ ఎన్‌రోల్ అయిఉన్న హిందూ పిల్లలు ఆ మదరసాలకు హాజరుకావడం లేదని కమిషన్ తనిఖీలో తేలింది.
దర్యాప్తు జరిగే కొద్దీ మరిన్ని అవినీతి వివరాలు బైటపడతాయని అధికారులు భావిస్తున్నారు. అసలు మదరసాల్లో విద్యార్ధుల చేరికలను, వాటి వెరిఫికేషన్‌ను ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్న సంగతి ఇంకా తెలియాల్సి ఉంది.
ఒక మదరసాలో 2004లో చదివినట్టు చూపించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మానవ్ గోయల్, డాక్టర్ ప్రియా మిట్టల్, డాక్టర్ జ్యోత్స్నా గోయల్ వంటి వారి పేర్లు మళ్ళీ 2018, 2023ల్లో కూడా ఎన్‌రోల్ అయి ఉన్నాయి. అంటే ప్రభుత్వ నిధులను కాజేయడం కోసం దొంగపేర్లతో ఎన్‌రోల్‌మెంట్లు చేస్తున్నారని తెలుస్తోంది.