ఉత్తరప్రదేశ్ మథురలోని కృష్ణజన్మభూమి – షాహీ ఈద్గా మసీదు వివాదంలో హిందువుల పక్షానికి కీలక విజయం లభించింది. వారు దాఖలు చేసిన 18 సివిల్ కేసులకూ విచారణార్హత ఉందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. మథురలో శ్రీకృష్ణుడి జన్మస్థానమైన 13.37 ఎకరాల భూమి కోసం హిందువులు చేస్తున్న న్యాయపోరాటంలో ఈ తీర్పు కీలకమైన మలుపు.
శ్రీకృష్ణజన్మస్థానంలోని ఆలయాన్ని 1669-70లో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు ధ్వంసం చేసి, అక్కడ షాహీ ఈద్గా మసీదు నిర్మించాడు. దాన్ని తమకు తిరిగి అప్పగించాలని హిందువులు న్యాయపోరాటం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ప్రస్తుతం 18 సివిల్ దావాలు ఉన్నాయి. అసలు వాటికి విచారణార్హత లేదంటూ ముస్లిముల పక్షం వాదిస్తోంది. ఆ విషయంలోనే అలహాబాద్ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ మాయాంక్ కుమార్ జైన్ ఇవాళ కీలకమైన తీర్పునిచ్చారు.
1968లో శ్రీకృష్ణజన్మస్థాన్ సేవాసంస్థాన్, ట్రస్ట్ షాహీ మజీద్ ఈద్గా మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దానిప్రకారం ఆ ఆవరణలోనే మసీదు, గుడి రెండింటినీ నిర్వహించుకోవాలి. అయితే ఆ ఒప్పందం మీదనే చాలా వివాదాలున్నాయి. అసలు ఆ ఒప్పందం కుదుర్చుకున్న పరిస్థితులు అత్యంత అనుమానాస్పదంగా ఉన్నాయనీ, ఆ ఒప్పందానికి చట్టబద్ధతే లేదనీ హిందువులు వాదిస్తున్నారు.
హిందూపక్షం తరఫు వాదనలు:
హిందువుల తరఫు న్యాయవాదులు విష్ణుశంకర్ జైన్, రీనా సింగ్ తదితరుల వాదన ఏంటంటే
(1) చారిత్రకంగా కృష్ణజన్మస్థాన్కు చెందిన భూమిని షాహీ ఈద్గా మసీదు ఆక్రమించింది. 1968 ఒప్పందమే అత్యంత సందేహాస్పదంగా ఉంది. దానికి న్యాయపరమైన చట్టబద్ధత లేదు.
(2) షాహీ ఈద్గా మసీదు ప్రభుత్వ రికార్డుల్లో ఒక ఆస్తిగా రిజిస్టర్ అయి లేదు. అది చట్టవిరుద్ధమైన ఆక్రమణ. అది వక్ఫ్ ఆస్తే అయినట్లయితే ఆ మేరకు ఆ స్థలాన్ని దానం చేసినట్లు డాక్యుమెంట్లను వక్ఫ్ బోర్డ్ చూపించాలి.
(3) ఈ కేసుకు ప్రార్థనాస్థలాల చట్టం 1991, లిమిటేషన్ చట్టం 1963, వక్ఫ్ చట్టం వర్తించవు. సరైన యాజమాన్య హక్కులు లేకుండా ఆ భూమిని ఆక్రమించి, దాన్ని వక్ఫ్ ఆస్తిగా మార్చేసుకోవడం చట్టవిరుద్ధం.
(4) ప్రస్తుతం వివాదంలో ఉన్న స్థలం ప్రాచీన కట్టడాల పరిరక్షణ చట్టం ప్రకారం రక్షిత స్థలం. ఆ మేరకు 1920 ఫిబ్రవరి 26న ఒక నోటిఫికేషన్ కూడా జారీ అయింది. అందువల్ల ఆ స్థలం వక్ఫ్ ఆస్తి అని చేస్తున్న వాదనలు చెల్లవు.
మసీదు కమిటీ సవాల్:
ట్రస్ట్ షాహీ మజీద్ ఈద్గా తరఫున తస్నీమ్ అహ్మదీ, నసీరుజ్జమాన్ తదితరులు హిందువుల పక్షం వేసిన దావాలే అసలు చెల్లవని వాదించారు.
(1) 1947 ఆగస్టు 15 నాటికి ఒక ప్రార్థనాస్థలం ఏ మతానికి చెందినదై ఉంటుందో దాన్ని మార్చడాన్ని 1991 ప్రార్థనాస్థలాల చట్టం నిషేధించింది.
(2) 1668-69లో మసీదు నిర్మాణం జరిగింది. 1968లో ఒప్పందం చేసుకున్నారు. అందువల్ల లిమిటేషన్ యాక్ట్ 1963 ప్రకారం, 2020లో దాఖలు చేసిన వ్యాజ్యాలు కాలదోషం పట్టినవి. కాబట్టి వాటికి విచారణ యోగ్యత లేదు.
(3) వ్యాజ్యం దాఖలు చేసిన నాటికి ఆస్తి వాస్తవంగా ఎవరి అధీనంలో ఉందో వారికి మాత్రమే శాశ్వత ఇంజంక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.
(4) మసీదు స్థలం వక్ఫ్ ఆస్తి కాబట్టి, దానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించవలసింది వక్ఫ్ ట్రిబ్యునల్ మాత్రమే, సివిల్ కోర్టుకు ఆ అధికారం లేదు.
హైకోర్టు తీర్పు:
మజీదు కమిటీ ప్రస్తావించిన అభ్యంతరాలను జస్టిస్ మాయాంక్ కుమార్ జైన్ కొట్టిపడేసారు. హిందూ కక్షిదారులు దాఖలు చేసిన 18 దావాలకూ విచారణ అర్హత ఉందని స్పష్టం చేసారు. ప్రార్థనాస్థలాల చట్టం 1963, లిమిటేష్ యాక్ట్ 1963 లేదా స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 ప్రకారం ఆ వ్యాజ్యాలను తిరస్కరించలేరని వివరించారు. ఆ కేసులను వాటి మెరిట్ ఆధారంగా విచారించడానికి అనుమతించారు.
తీర్పులోని ప్రధానమైన అంశాలు:
(1) ఫిర్యాదిదారులు చెప్పినట్లు వివాదాస్పద స్థలానికి మతపరమైన గుర్తింపు, ఆ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నారనడానికి తగినన్ని ఆధారాలున్నాయని కోర్టు భావించింది.
(2) ఒక భూమి స్థితిగతులను ప్రభుత్వం దానికి సంబంధించిన అందుబాటులోని సమాచారం ఆధారంగా సమర్థించాలి తప్ప రాజకీయ స్వార్థాలతోనో లేక నిర్హేతుకమైన నిర్ణయాలతోనో చట్టప్రక్రియను మార్చేయకూడదు.
(3) కృష్ణజన్మభూమి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత కారణంగా ఆ ప్రదేశంలో హిందూభక్తులకు తమ ఆచార సంప్రదాయాల ప్రకారం పూజలు, ప్రార్థనలు చేసుకునే హక్కును రక్షించడం ప్రధానం అని న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది.