కొండచరియలు విరిగిపడి వందలాది మంది మరణించిన వయనాడ్ జిల్లాను డార్క్ టూరిజం ముప్పు వెంటాడుతోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నందున పర్యాటకులు వయనాడ్ జిల్లాకు రావద్దని కేరళ పోలీసులు ఎక్స్ వేదికగా కోరారు. పర్యాటకులు వస్తే సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని, అందుకే పర్యాటకులు రావద్దని పోలీసులు సూచించారు.
యుద్దభూమి, జైలు, ప్రముఖులను చంపిన ప్రదేశాలను కొందరు సందర్శిస్తుంటారు. ఇలాంటి పర్యటనలకు డార్క్ టూరిజంగా పేరు పెట్టారు. అందమైన ప్రాంతాలనే కాదు, విషాద ఘటనలు జరిగిన ప్రాంతాలను కూడా కొందరు పర్యటిస్తుంటారు. అలాంటి జాబితాలో వయనాడ్ చేరింది. కొండచరియలు విరిగిపడి వందలాది మంది చనిపోయిన ప్రాంతంలో జరిగిన విధ్వంసం చూసేందుకు వందలాది మంది తరలివస్తున్నారు. వారిని అదుపు చేయడం కేరళ పోలీసులకు పెద్ద సమస్యగా మారింది.