శ్రీశైలం మల్లికార్జునస్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన చంద్రబాబుకు అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి కృష్ణమ్మకు జల హారతి ఇచ్చారు.
సున్నిపెంటలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, శ్రీశైలాన్ని దివ్యక్షేత్రంగా తయారు చేస్తామన్నారు. సముద్రంలోకి వృథాగా వెళ్తున్న నీటిని రాయలసీమకు మళ్లించి కరువు లేకుండా చేస్తామన్నారు. నీటి వనరులుంటే సంపద సృష్టించవచ్చు అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్గాలకు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు మరో రెండు, మూడు రోజుల్లో నిండుతున్నాయన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రావాలన్నారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తామన్నారు. రైతులు ఉద్యానవన పంటలు వేసేందుకు ముందుకు రావాలని కోరారు.
శ్రీశైలం పర్యటన ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీసత్య సాయి జిల్లాకు వెళ్ళారు. మడకశిర మండలంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.