పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ సైనిక విభాగం కమాండర్ మొహమ్మద్ డెయిఫ్ మరణించాడు. దక్షిణ గాజా ప్రాంతంలో జులై 13న జరిగిన వైమానికదాడిలో అతన్ని మట్టుపెట్టినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇవాళ ఒక ప్రకటనలో పేర్కొంది.
మొహమ్మద్ డెయిఫ్ చనిపోయినట్లు తమ నిఘావర్గాలు కొద్దిసేపటిక్రితమే ధ్రువీకరించాయని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. జులై 13న హమాస్ సంస్థకు చెందిన ఖాన్ యూనిస్ బ్రిగేడ్ కమాండర్ రఫా సలామే నివాసంపై వైమానిక దాడి జరిగింది. డెయిఫ్‌ను లక్ష్యంగా చేసుకునే ఇజ్రాయెల్ ఆ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ దాడిలో సలామే చనిపోయాడని జులై 14నే ఐడిఎఫ్ నిర్ధారించింది. అయితే డెయిఫ్ గురించి అప్పుడు కచ్చితంగా తెలియరాలేదు.
జులై 13న సలామే నివాసానికి డెయిఫ్ రాక గురించి తమకు అందిన సమాచారం కచ్చితమైనదని ఐడిఎఫ్ నిఘా విభాగం సూచించింది. తాము చెప్పిన భవనంలోనే హమాస్ నాయకులిద్దరూ సమావేశమయ్యారని కూడా స్పష్టం చేసింది. సలామే నివాసానికి డెయిఫ్ రాకను నిఘా విభాగం ధ్రువీకరించాక, అప్పటికే ఆ భవనాన్ని మార్క్ చేసుకుని గగనతలంలో మోహరించిన ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్‌కు లక్ష్యం మీద దాడి చేయాలన్న కమాండ్ అందింది. కొన్ని నిమిషాల్లోనే దాడి పూర్తయిపోయింది.
హమాస్ రాజకీయ విభాగం ఛైర్మన్ ఇస్మాయిల్ హనియే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జులై 31న హతమయ్యాడు. ఆ వార్త వచ్చిన ఒకరోజు తర్వాత, అంటే ఇవాళ, హమాస్ మిలటరీ విభాగం కమాండర్‌ను మట్టుపెట్టిన వార్తను ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. అయితే హనియే మరణం గురించి ఇజ్రాయెల్ స్పందించకపోవడం గమనార్హం. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బుధవారం ఒక ప్రకటనలో ‘‘మూడు వారాల క్రితం మేం హమాస్ మిలటరీ చీఫ్ మొహమ్మద్ డెయిఫ్‌పై దాడి చేసాం. రెండు వారాల క్రితం మేం హుతీల మీద దాడి చేసాం. నిన్న హెజ్బొల్లా మిలటరీ చీఫ్ ఫాద్ షుక్ర్ మీద దాడి చేసాం’’ అని వెల్లడించారు.
ఇజ్రాయెల్‌ను ఆక్రమించడమే లక్ష్యంగా పనిచేస్తున్న పాలస్తీనియన్ ఉగ్రవాద సంస్థ హమాస్ రాజకీయ, సైనిక విభాగాల అధినేతలు ఇద్దరూ హతమవడం ఆ సంస్థకు, పాలస్తీనాకు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి.