తక్షణమే విచారణ జరిపి వివరణ ఇవ్వాలంటున్న హిందూసంఘాలు
కలియుగ దైవం శ్రీ వేంకటేశుడు కొలువైన తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందంటూ కొన్నేళ్ళుగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పరిధిలోని వివిధ శాఖల్లో హిందూయేతర మతాలకు సంబంధించిన వారిని ఉద్యోగులుగా నియమించారని, ఆ విధానం సరికాదని పలువురు తప్పుబడుతున్నారు. హిందువులకు పవిత్ర క్షేత్రమైన తిరుమలలో అన్యమతస్తులను ఎలా నియమిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
తిరుమలకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఇస్లాం మతానికి సంబంధించిన ఓ వ్యక్తిని టీటీడీ విద్యుత్ శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హోదాలో నియమించడంపై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సనాతన ధర్మాన్ని పాటించే వారినే తితేదే పరిధిలోని శాఖల్లో ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
గతంలోనూ ఇలాంటి తరహా ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తు చేస్తున్నారు. తక్షణమే హిందూయేతర ఉద్యోగులను బదిలీ చేసి సనాతన ధర్మాన్ని పాటించే వారికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే టీటీడీ పరిధిలోని ఇతర శాఖల్లోని హిందూయేతర ఉద్యోగులను కూడా తక్షణమే బదిలీ చేసి, క్షేత్ర పవిత్రతను కాపాడాలని కోరుతున్నారు. హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలపై నమ్మకం లేనివారిని, దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వరస్వామిని భగవంతుడిగా అంగీకరించని వారిని ఉద్యోగులుగా తీసుకోవద్దని విన్నవిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోపై టీటీడీ ఇంకా స్పందించలేదు. ఆ ఉద్యోగి ఎవరనే వివరాలతో పాటు, ఎందుకు నియమించారనే విషయంపై వివరణ ఇవ్వాల్సిఉంది. డిప్యూటేషన్ పై నియమించారా లేదా మరేదైనా కారణం ఉందో స్పష్టం చేయాల్సి ఉంది.