సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను రాష్ట్రప్రభుత్వాలే ఉపవర్గీకరణ చేసుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం తాజాగా తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఆరుగురు ఈ తీర్పును వెలువరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేయవద్దన్న 2004నాటి తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఎస్సీ, ఎస్టీల ఉపవర్గీకరణపై 2004లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి సహా ఏడుగురు సభ్యుల ధర్మాసనం కొట్టివేసింది. తాజా తీర్పుతో తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీల వర్గీకరణకు మార్గం సుగమం కానుంది. రెండున్నర దశాబ్దాలుగా మాదిగల వర్గీకరణ కోసం పోరాటం సాగుతోంది. 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వాదోపవాదాలు జరిగాయి. తాజాగా మరోసారి కేసు విచారణకు వచ్చింది. ఉప వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు గురువారంనాడు ఇచ్చిన తీర్పు న్యాయచరిత్రలో మైలురాయిగా నిలవనుంది.