వయనాడ్‌లో వరద విలయం నుంచి యాజమాని కుటుంబాన్ని గోమాత కాపాడింది. చూరాల్‌మలలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్నాటక చామరాజనగర్‌కు చెందిన వినోద్ కుటుంబంతో కలిసి చూరాల్ మలలో నివాసం ఉంటున్నాడు. వినోద్ భార్య ప్రవిద కొద్దిరోజుల కిందట పుట్టింటికి వెళ్లింది. మిగిలిన కుటుంబసభ్యులతో కలిసి వినోద్ నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో ఇంట్లో పెంచుకునే ఆవు బిగ్గరగా అరిసింది. ఆ చప్పుడుకు నిద్రలేచి చూడగా గోమాత సగం లోతు నీళ్ళలో ఉండటాన్ని గమనించాడు. తమ ప్రాంతానికి వరద పోటెత్తిందని గ్రహించి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశాడు. వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళి ప్రాణాలు కాపాడుకున్నారు.
చూరాల్‌మలకు ఆరు కిలో మీటర్ల దూరంలో వినోద్ అత్తగారి ఊరు మెప్పడికి కూడా ఆ సమయంలోనే సమాచారం అందించారు. వారు కూడా సురక్షిత ప్రదేశానికి చేరుకున్నారు. అనంతరం కొండచరియలు విరిగిపడటంతో వినోద్ ఇల్లు ధ్వంసమైంది. తాము పెంచుకునే ఆవు తమ ప్రాణాలు కాపాడిందని వినోద్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.