కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 256కు చేరింది. మరో 220 మంది ఆచూకీ గల్లంతైంది. సహాయ చర్యల్లో భాగంగా ఆర్మీ అధికారులు ఇప్పటి వరకు 1000 మందిని రక్షించారు.
భారీ వర్షాలతో ముండక్కై, చూరమల, అత్తమల, నూల్పుళ గ్రామాల్లో మంగళవారం నాడు మూడు దఫాలుగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ మూడు గ్రామాల్లో పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగింది. 1,500 ఆర్మీ సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో సేవలు అందిస్తున్నారు. చూరమలలో ఆర్మీ ఇంజినీర్ టాస్క్ఫోర్స్ బృందం తాత్కాలిక వంతెన నిర్మించింది. భారీ వర్షాలు కొనసాగుతుండటంతో మరోమారు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఎన్డీఆర్ఎఫ్ హెచ్చరించింది.
వయనాడ్ లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇప్పటికే సహాయక చర్యల్లో పాల్గొని బాధితులకు సేవలు అందిస్తున్నారు. సేవా భారతి కార్యకర్తలు కూడా చురుకుగా సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేడు వయనాడ్ సందర్శించి బాధితులను పరామర్శించనున్నారు. లోక్ సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా నేడు వయనాడ్ లో పర్యటించనున్నారు.