భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ బుధవారం పెద్దలసభలో మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. దేశ సంక్షేమం కోసం పనిచేస్తున్న సంస్థ ఆర్ఎస్ఎస్ అన్నారు. దేశం కోసం నిస్వార్థంగా పనిచేసే అటువంటి సంస్థను చూసి ప్రతీఒక్కరూ గర్వపడాలన్నారు.
బుధవారం రాజ్యసభలో మాట్లాడిన జగదీప్ ధన్‌ఖడ్, ఆర్ఎస్ఎస్లో దేశం కోసం నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులు ఉన్నారని వెల్లడించారు. ‘‘ఈ దేశపు ప్రగతి ప్రస్థానంలో పాలుపంచుకునేందుకు రాజ్యాంగపరంగా అన్ని హక్కులూ ఉన్న సంస్థ సంఘ్ అని ప్రకటిస్తున్నాను. ఆ సంస్థకు నిష్కళంకమైన చరిత్ర ఉంది. దేశం కోసం నిస్వార్థంగా పని చేసేందుకు అంకితభావం కలిగిన కార్యకర్తలు సంఘ్ స్వయంసేవకులు. ఈ దేశపు అభివృద్ధి ప్రయాణంలో వారిని భాగస్వాములు కాకుండా నిలువరించడం రాజ్యాంగ వ్యతిరేకం మాత్రమే కాదు, నిబంధనలకు విరుద్ధం కూడా’’ అని స్పష్టం చేసారు.
ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై ఇన్నాళ్ళుగా ఉన్న నిషేధాన్ని ఇటీవల కేంద్రప్రభుత్వం తొలగించివేసింది. ఆ నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్ ఈ వ్యాఖ్యలు చేసారు. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి, వివాదాస్పదం చేసాయి.
కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ కేంద్రప్రభుత్వ నిర్ణయం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వోద్యోగులు అందరికోసం పనిచేయాలనీ, వారు ఉద్యోగంలో ఉన్నప్పుడు తటస్థంగా ఉండాలనీ అన్నారు. ‘‘ఇది చాలా విచిత్రంగా ఉంది. ప్రభుత్వం పని, ఆర్ఎస్ఎస్ పనీ పూర్తిగా వేరు. ఆ రెండూ కలిసి ఉండకూడదు. నరేంద్రమోదీ ప్రభుత్వం గత పదేళ్ళలో ఆ నిషేధాన్ని తొలగించలేదు. మరిప్పుడు ఎందుకు తొలగిస్తోంది? ప్రజలందరికోసం, దేశం కోసం పని చేయడం ప్రభుత్వోద్యోగుల బాధ్యత. రిటైర్ అయాక వారు ఏమైనా చేసుకోవచ్చు, కానీ ప్రభుత్వ సర్వీసులో ఉన్నప్పుడు తటస్థంగా ఉండాలి’’ అని శశిథరూర్ అన్నారు.