కేరళలోని వయనాడ్ ప్రాంతం ప్రకృతి బీభత్సంలో చిక్కుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భయంకరమైన వర్షపాతం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. మూడుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకూ 150కి పైగా మరణించినట్లు అధికారికంగా తెలుస్తోంది. మరికొన్ని వందల మంది గల్లంతయ్యారు. వేలాదిమంది గాయపడ్డారు. అన్నిరకాల రవాణా వ్యవస్థలూ స్తంభించిపోయాయి. ఆ ప్రాంతంలో ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కేరళలోని వామపక్షకూటమి ప్రభుత్వం, కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం పరస్పరం సమన్వయంతో పని చేస్తున్నాయి. అక్కడ సహాయక చర్యల్లో భారత సైన్యం, వైమానికదళం, ఎన్డిఆర్ఎఫ్ తదితర దళాలు సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి. ముస్లిం జనాభా అతిఎక్కువ ఉన్న ఆ ప్రాంతంలో సైతం ఆర్ఎస్ఎస్, సేవాభారతి సంస్థలు స్వచ్ఛందంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో టెలిఫోన్లో సంభాషించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పూర్తి అండగా ఉంటామని, ఆసరాగా నిలుస్తామనీ హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడినవారికి రూ.50వేలు చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. అలాగే, సహాయక చర్యల కోసం కేరళలోని బీజేపీ కార్యకర్తలను తరలించమని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మోదీ సూచించారు.
ఇలాంటి పరిస్థితుల్లో వయనాడ్‌లో కనిపించడం లేనిది ఎవరయ్యా అంటే అక్కడి ఎంపీ, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఒక్కరే. రాహుల్ 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ పరిస్థితి బాగోలేదని గ్రహించి కేరళలో ముస్లిములు ఎక్కువగా ఉండే వయనాడ్ స్థానం నుంచి కూడా పోటీ చేసారు. ఆయన ఆశను వయనాడ్ ప్రజలు వమ్ము చేయలేదు. అమేఠీ ప్రజలు ఓడించినా, వయనాడ్ ఓటర్లు నెత్తిన పెట్టుకున్నారు. అందుకే రాహుల్ 2024 ఎన్నికల్లో కూడా వయనాడ్ నుంచి పోటీ చేసారు. ఇప్పుడు అదృష్టవశాత్తు రాయబరేలీలో గెలిచేసరికి, వయనాడ్‌ను వదిలేసారు. అక్కడనుంచి ప్రియాంకాగాంధీ పోటీచేస్తారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. ఎలాగూ వదిలేసిన స్థానమే కదా అన్న నిర్లక్ష్యమో ఏమో, రాహుల్ వయనాడ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ విషయమే రాజకీయ పరిశీలకులను విస్మయానికి గురిచేసింది.
మంగళవారం నాడు రాహుల్ గాంధీ తన ఎక్స్ సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా ఓ కంటితుడుపు ట్వీట్ చేసారు. ‘‘నేనూ, ప్రియాంకా బుధవారం వయనాడ్‌లో పర్యటించాలనుకున్నాం. బాధిత కుటుంబాలను కలిసి, అక్కడి స్థితిగతుల గురించి తెలుసుకుందామనుకున్నాం. అయితే నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల మేం అక్కడ ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి వీలైనంత త్వరగా మేం అక్కడికి వచ్చి పరామర్శిస్తామని హామీ ఇస్తున్నాను. మేం వయనాడ్ పరిస్థితిని సన్నిహితంగా పరిశీలిస్తున్నాం. అన్నిరకాలైన సహాయమూ చేస్తాం. ఈ కష్టకాలంలో వయనాడ్ ప్రజల గురించే ఆలోచిస్తున్నాం’’ అంటూ రాసుకొచ్చారు.
వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా, స్థానిక ఎంపీ అయిన రాహుల్ గాంధీ వయనాడ్‌లో ఇలాంటప్పుడు పర్యటించకపోతే ఎలా? ఆయన స్వయంగా వచ్చి తమను కలిసి ఉంటే బాగుండేదని బాధితులు భావిస్తున్నారు.