భారీవర్షాల కారణంగా కేరళ వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ మధ్యాహ్నానికి 158మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకొన్ని వందల మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారు. మరికొన్ని వందల మంది ఆచూకీ తెలియరాలేదు. వయనాడ్ ప్రాంతమంతా అల్లకల్లోలంగా ఉంది.
బాధితులను రక్షించడానికి, తరలించడానికీ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 322 మంది భారత సైన్యం జవాన్లు, రెండు ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లు, ఒక ఎంఐ 17 విమానం, ఒక అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అయినా ఇంకా ఎంతో సహాయం అందాల్సి ఉంది.
వయనాడ్‌లో స్వయంసేవకుల సేవా కార్యక్రమాలు:
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు భారతదేశంలో మొదట గుర్తొచ్చే స్వచ్ఛంద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. వయనాడ్‌లో కూడా ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్‌లు, సంఘ్ అనుబంధ సంస్థ సేవాభారతి కార్యకర్తలూ వెంటనే రంగంలోకి దిగారు. మరణించినవారి శవాలు ఎక్కడున్నాయో వెతకడంలో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలకు సహాయపడుతున్నారు. బాధితులకు మొదట కావలసిన ఆహారాన్ని సమకూర్చడానికి ఫుడ్ క్యాంప్‌లు ఏర్పాటు చేసారు. సమస్తం కోల్పోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితిలో ఉన్నవారికి ముందుగా ఆశ్రయం కల్సిస్తున్నారు. అయినవారు ఎక్కడున్నారో తెలియక తల్లడిల్లిపోతున్నవారికి సమాచారం అందిస్తున్నారు. ఈ దుర్ఘటనలో మరణించినవారికి సగౌరవంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
వయనాడ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందల మంది స్వయంసేవకులు అక్కడికి చేరుకున్నారు. నిస్వార్థంగా సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రకృతి ప్రకోపానికి బలైనవారిని అక్కున చేర్చుకుని, వారికి అండగా నిలుస్తున్నారు.
గాయపడిన వారిని ఆస్పత్రులకు చేర్చడానికి సురక్షితమైన రవాణా వ్యవస్థను స్వయంసేవకులు ఏర్పాటు చేసారు. బాధితులకు తక్షణం వైద్యసహాయం అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. రహదారులకు అడ్డుగా పడిన కొండచరియలను తొలగించే పనిలో మరికొందరు స్వయంసేవకులు నిమగ్నమయ్యారు. తద్వారా అత్యవసర వాహనాలు వేగంగా ప్రభావిత ప్రాంతాలకు, అక్కడినుంచి ఆస్పత్రులకూ వెళ్ళడానికి వీలు కలిగింది. ఆస్పత్రుల వద్ద కూడా స్వయంసేవకులు పనిచేస్తున్నారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఆహారం, ఇతర కనీస అవసరాలను సరఫరా చేస్తున్నారు.
సేవాభారతి మొబైల్ మార్చురీ సిస్టమ్:
సేవాభారతి కార్యకర్తలు ‘చితాగ్ని’ పేరిట మొబైల్ మార్చురీ సిస్టమ్‌ను వయనాడ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. మృతదేహాలకు మర్యాదపూర్వకంగా అంతిమసంస్కారాలు నిర్వహిస్తున్నారు.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సంప్రదాయరీతిలో అంత్యక్రియలు చేయడం పెద్ద సవాల్. ఈ ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలు తగిన వనరులూ, సరైన ఆర్థిక స్తోమతా లేకపోవడం వల్ల అయినవారి అంత్యక్రియలు తమ పద్ధతుల ప్రకారం జరిపించలేకపోతున్నామనే బాధలో ఉన్నాయి. అలాంటివారికి సేవాభారతి ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది.
సేవాభారతి మొబైల్ క్రిమేషన్ పద్ధతిని క్రైస్తవులు కూడా వినియోగించుకుంటున్నారు. చర్చ్ గ్రౌండ్స్‌లో వారి మత పద్ధతుల ప్రకారం అంత్యక్రియలు చేయడానికి తగినంత స్థలం లేనందున ఈ ‘చితాగ్ని’ సేవలను వారు వాడుకుంటున్నారు.
కేరళలోని వయనాడ్ జిల్లాలో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆ ప్రాంతంలో 24గంటల వ్యవధిలో మూడుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ రాష్ట్రంలో ఏకంగా 372 మిల్లీమీటర్ల వర్షపాతం పడడంతో వరదనీరు వెల్లువెత్తింది. రహదారులు బ్లాక్ అయిపోయాయి. ప్రజారవాణా వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. బాధితులను రక్షించే సహాయక బృందాలకు రవాణా పెద్ద సమస్యగా తయారయింది. అలాంటి క్లిష్ట సమయంలో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు, సేవాభారతి కార్యకర్తల సేవలు ప్రజలకు ఎంతగానో ఉపకరిస్తున్నాయి.