రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన గవర్నర్ల సమావేశం జరగనుంది. దిల్లీ వేదికగా ఆగస్టు 2, 3 తేదీల్లో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కర్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, నీతి ఆయోగ్ సీఈవో, హోంశాఖ, ఇతర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
నేర, న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలపై ఈ సదస్సులో సమాలోచనలు చేయనున్నారు. గిరిజన ప్రాంతాలు, వెనుకబడిన జిల్లాలు, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి, మై భారత్, ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్, ఏక్ వృక్ష్ మాకే నామ్ అంశాలపై అధికారులకు మార్గనిర్దేశం చేస్తారు.
సేంద్రియ వ్యవసాయం, ప్రజా సంబంధాల మెరుగుపర్చుకోవడం, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో సమన్వయంపై అవగాహన కల్పించనున్నారు. గవర్నర్లు బృందాలుగా విడిపోయి కీలక అంశాలపై చర్చించనున్నారు.