శ్రీలంక పల్లెకెలెలో జరిగిన ఆఖరి, మూడవ టి-20 మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. సీరీస్‌ను 3-0 తో వైట్‌వాష్ చేసింది. ఇరుజట్ల మధ్యా మూడు వన్డేల సీరీస్ శుక్రవారం మొదలవుతుంది.
మంగళవారం రాత్రి జరిగిన మూడవ టి-20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక మొదట్లో ధాటిగా ఆడినా చివరి ఐదు ఓవర్లలో తడబడింది. ఆ జట్టు కూడా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. దాంతో టై బ్రేకర్‌గా సూపర్ ఓవర్ అనివార్యమైంది.
వాషింగ్టన్ సుందర్ వేసిన సూపర్ ఓవర్లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ కుశల్ పెరీరా, పతుమ్ నిస్సంక ఇద్దరినీ వరుస బాల్స్‌లో ఔట్ చేసాడు. మహీష్ తీక్షణ వేసిన సూపర్ ఓవర్లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫోర్ కొట్టడంతో మ్యాచ్‌ను భారత్ గెలుచుకుంది.
ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ టైటిల్ సాధించాడు. ఫీల్డర్ ఆఫ్ ది సీరీస్‌గా రింకూ సింగ్ ఎంపికయ్యాడు.