ముంబై నగర శివార్లలోని ధారవి ప్రాంతంలో ఆదివారం (జులై 28) నాడు అరవింద్ వైశ్య అనే పేరున్న యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. హతుణ్ణి పోలీసు అధికారుల కళ్ళముందే అల్లు, ఆరిఫ్ , షేర్ అలీ, ఇంకా వారి సహచరులు చంపేసారు. హతుడు అరవింద్ ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ కావడం గమనార్హం.
ఆదివారం రాత్రి 7.15 సమయంలో అల్లు, ఆరిఫ్, శుభం, షేర్ అలీ, సిద్దేష్ మధ్య ఘర్షణ రేకెత్తింది. అది పెరిగి పెద్దదైంది. అల్లు, అతని సహచరులు కలిసి సిద్దేష్, అతని తండ్రిని చితకబాదారు. వారిని ఆపడానికి అరవింద్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ ఘటనలో న్యాయం కోరుతూ అరవింద్ ధారవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. అప్పుడు విధుల్లో ఉన్న ఇనస్పెక్టర్, అరవింద్ విజ్ఞప్తిని స్వీకరించి అతనికి తోడుగా ఇద్దరు కానిస్టేబుళ్ళను పంపించాడు. అయితే ఆ పోలీసుల ఎదురుగానే సద్దాం, జుమ్మన్ అనే ఇద్దరు వ్యక్తులు అరవింద్‌ను తన ఫిర్యాదు ఉపసంహరించుకోవాలంటూ బెదిరించారు. వారి బెదిరింపులను పట్టించుకోకుండా అరవింద్ ఘటనా స్థలానికి పోలీసులతో బయల్దేరాడు.
వారు రాజీవ్‌నగర్‌లోని వాసిం గ్యారేజీ దగ్గరకు చేరుకునేసరికి అల్లు, ఆరిఫ్, సద్దాం, జుమ్మన్, షేర్ అలీ అనే ముస్లిం యువకుల గుంపు అరవింద్ మీద ఉన్నట్టుండి దాడి చేసింది. కానిస్టేబుల్స్ చూస్తూండగానే వారు అరవింద్‌ను ఛాతీ మీద కత్తితో పొడిచేసారు. పోలీసులు అల్లును పట్టుకున్నారు, మిగిలినవారు పారిపోయారు.
అరవింద్‌ను హుటాహుటీ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక నిందితుణ్ణి అరెస్ట్ చేసారు, మిగిలిన వారికోసం వెతుకుతున్నారు.
అరవింద్ హత్యలో ఏడుగురు దుండగుల ప్రమేయం ఉందని, కానీ పోలీసులు కేవలం ఇద్దరు అనుమానితుల పేర్లనే ఎఫ్ఐఆర్లో నమోదు చేసారనీ విశ్వహిందూ పరిషద్ ఆరోపించింది. సంఘ స్వయంసేవక్ హత్యలో ప్రమేయం ఉన్న అందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలంటూ హిందూ సంస్థలు పోలీస్ స్టేషన్ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించాయి.
అరవింద్ కుటుంబ సభ్యులు అతని హత్య ఉద్దేశపూర్వకంగానే జరిగినదేనని ఆరోపిస్తున్నారు. స్థానికంగా హిందూ సమస్యలకు బలమైన గళంగా అరవింద్ వ్యవహరిస్తున్నందున ముస్లిములు అతన్ని నిర్దిష్టంగా తమ లక్ష్యంగా చేసుకుని దాడి చేసారని చెబుతున్నారు. ఆరిఫ్, సద్దాం తదితర యువకులు అరవింద్‌ను చంపడం కోసమే దాడి చేసారని వివరించారు.